తెలంగాణ జన సమితిని కీలక నేతలంతా వీడుతున్నారు. తాజాగా జన సమితి కీలక నేతలు వెంకట్ రెడ్డి, మమతారెడ్డి బీజేపీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరితోపాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరారు. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ కోదండరాముని నాయకత్వంలోని టీజేఎస్ నేతలు వలస బాట పట్టడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పొచ్చు.
ఉద్యమ కాలం నుంచి కోదండరాం నాయకత్వంలో పని చేసిన కీలక నేతలంతా కాంగ్రెస్ , బీజేపీలో చేరుతున్నారు. టీ-జేఎసీ ఉనికిలో ఉన్న సమయంలో కోదండరాం పిలుపులో ప్రముఖంగా పని చేసిన నేతలు కోదండరాం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే మరో ఆలోచన లేకుండా ఆయనతో కలిసి అడుగులేశారు. కానీ కోదండరాం సున్నిత మనస్తత్వం…ప్రతిసారి వేచి చూసే ధోరణితో కీలక నేతలు పార్టీ ఏర్పాటు చేసిన కొద్దికాలానికే టీజేఎస్ కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికిలో ఉందంటే ఎవరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు ఉన్నందువల్లే. తాజాగా వెంకట్ రెడ్డితోపాటు మమతా లాంటి సీనియర్ నేతలు కూడా ఆ పార్టీని వీడటంతో టీజేఎస్ చాప్టర్ ఇక క్లోజ్ అవుతుందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
అయితే.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలపై కోదండరాం నేతృత్వంలో ఆశించిన స్థాయిలో ఉద్యమ కార్యాచరణ ఉండటం లేదు. ఇటీవలి పేపర్ లీక్ వ్యవహరంలోనూ బీఆర్ఎస్ ను ఎండగట్టేలా టీజేఎస్ ఆధ్వర్యంలో పెద్దగా నిరసన కార్యక్రమాలు జరగలేదు. కేవలం మీడియా సమావేశంలోనే కేటీఆర్ రాజీనామా , టీఎస్ పీస్సీ ప్రక్షాళనను కోదండరాం డిమాండ్ చేస్తున్నారే తప్పితే క్షేత్రస్థాయిలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వలేదు. దీంతో టీజేఎస్ లో కొనసాగలేక ఆ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీతో అనుబంధాన్ని తెంచుకుంటున్నారు.
టీజేఎస్ అంటేనే రాజకీయ నిరుద్యోగుల షెల్టర్ గా మారింది. కీలక నేతలంతా పార్టీని వీడగా ఓయూ విద్యార్ధి నేతలు మాత్రమే టీజేఎస్ జెండా నీడన కొనసాగుతున్నారు. వారికి కూడా ప్రధాన పార్టీల నుంచి ఆఫర్లు వస్తే జన సమితిని వీడే యోచనలో ఉన్నారు. ఇదే జరిగితే కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది.