తెలంగాణ బీజేపీ అద్యక్ష బాధ్యతలను మరో కొత్త నేతకు అప్పగించబోతున్నారా..? పేపర్ లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ను ప్రెసిడెంట్ పోస్ట్ లో కొనసాగించడం ఎంతమాత్రం భావ్యం కాదని హైకమాండ్ కు రాష్ట్ర నేతలు కొంతమంది నివేదికలు పంపించారా..? బండి అరెస్ట్ నేపథ్యంలో అద్యక్ష బాధ్యతల కోసం కీలక నేతలు తమకు సన్నిహితంగా ఉండే కేంద్రంలో బీజేపీ పెద్దలతో లాబియింగ్ కొనసాగించారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
గత కొద్ది కాలంగా బండి సంజయ్ అద్యక్ష బాధ్యతలపై చర్చ జరుగుతోంది. ఆయనను తప్పించి మరో నేతకు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని తరుణ్ చుగ్ లాంటి నేతలు చెబుతున్నా బండి పోస్ట్ కు ఎసరు తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అరెస్ట్ తో పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు కొంతమంది ప్రెసిడెంట్ పోస్ట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పేపర్ లీక్ వ్యవహారంలో సంజయ్ అరెస్ట్ కావడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో బీజేపీపై ఓ రకమైన హేయభావం ఏర్పడుతోందని ఢిల్లీ పెద్దలకు తెలిపినట్లు సమాచారం .
బండి సంజయ్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్తే దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని అద్యక్ష పదవిని ఆశిస్తోన్న నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లను పట్టించుకోకపోవడం, పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని బండి సంజయ్ పై ఫిర్యాదు కూడా చేశారని అంటున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని ఆరోపణలు వస్తుండటంతో అది పార్టీకి చేటుతెచ్చే పరిణామంగా మారుతోందని తెలిపారట. అదే సమయంలో బండి సంజయ్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తూ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేస్తున్నారని కేంద్ర పెద్దలకు తెలిపినట్లు బీజేపీ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజమైతె బండి స్థానంలో అద్యక్ష బాధ్యతలు ఎవరికీ కట్టబెడుతారనే చర్చ ఆ పార్టీలో జరుగుతుండటం విశేషం. ఆశావహులు చాలామందే ఉన్నా ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ , డీకే అరుణ వంటి నేతల పేర్లు ముందు వరుసలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. బండిని రాష్ట్ర అద్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవి కట్టబెట్టానున్నారని తెలుస్తోంది.
Also Read : బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దు..?