ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కమలం కండువా కప్పుకున్నారు.
బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు కిరణ్ కుమార్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఏనాడూ అనుకోలేదని కానీ తాజాగా ఆ పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఆయన ఇప్పుడు కొత్తగా పార్టీని వీడటం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణను ఏర్పాటు చేసిన తరువాత ఆయన కాంగ్రెస్ కు గతంలోనే రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. మళ్ళీ కొంతకాలం సైలెంట్ గానే ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గతంలోనే కాంగ్రెస్ ను వీడిన ఆయన తాజాగా తాను ఏనాడూ కాంగ్రెస్ ను వీడుతానని అనుకోలేదని చెప్పడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలహీనపడటానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓ కారణం. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పై అప్పట్లో అవాకులు చెవాకులు పేల్చారు. అనంతరం మళ్ళీ కాంగ్రెస్ లో చేరినా ఆయన ఏనాడూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. సోనియా గాంధీని ఈడీ వేధింపులకు గురి చేస్తే పార్టీ శ్రేణులంతా రోడ్దేక్కితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎక్కడ కనిపించలేదు.
కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ముఖ్యమంత్రి పదవి అనుభవించిన కిరణ్ కుమార్ పార్టీ కోసం ఒక్క బహిరంగ సభ ఏర్పాటు చేయలేదు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీలోనే కొనసాగుతున్నా ఏనాడూ పార్టీ పటిష్టతపై ఫోకస్ చేయని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేశానని ఇప్పుడు చెప్పుకోవడం హాస్యాస్పదమే. రోజురోజుకు కాంగ్రెస్ క్షీణిస్తుందని వ్యాఖ్యానించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి వలన ఆ పార్టీ చతికిలపడిందో చెప్తే బాగుండేది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి విశ్వాసఘాతకులను అందలం ఎక్కించడంతోనే కాంగ్రెస్ కు నేడు ఈ దుస్థితి వచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read : బీజేపీలోకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి..?