ప్రధాని మోడీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపారు పీఎంవో అధికారులు. అయితే కేసీఆర్ గత కొంత కాలంగా ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమంలో అస్సలు పాల్గొనడం లేదు. ఈసారి కూడా మోడీకి దూరంగానే ఉంటారా..? గతంలోని సంఘటనలు వదిలేసి భేష్ గ్గా కలిసిపోతారా..? అనే చర్చ జరుగుతోంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ సభలో మోడీ పాల్గొనున్నారు. ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేలా షెడ్యూల్ రూపొందించారు. ఇదంతా అధికారిక కార్యక్రమం కాబట్టి కేసీఆర్ నూ ఆహ్వానించి ప్రసంగించేందుకు సమయమిచ్చారు. అయితే తెలంగాణ సీఎంవొను సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రసంగించే వారి జాబితాలో కేసీఆర్ పేరును చేర్చే అవకాశం లేదని ప్రోటోకాల్ గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఇలా చూస్తే మోడీ పాల్గొనే సభకు కేసీఆర్ హాజరు అవ్వాలని నిర్ణయం తీసుకొని ఉండొచ్చునని తెలుస్తోంది.
గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను స్వాగతం పలికేందుకు పంపారు. ఈసారి కేసీఆరే ప్రధానికి స్వాగతం పలుకుతారా..? అనేది స్పష్టత లేదు కానీ కేసీఆర్ హాజరయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలెం. ఎందుకంటే… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇతర నిందితులందరిని అరెస్ట్ చేసిన ఈడీ .. కవిత విషయంలోనూ చాలా దూకుడు వహిస్తోంది. తదుపరి ఆమె అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం పట్ల కేసీఆర్ పై మోడీ సీరియస్ అయ్యారని…కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మోడీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ సై అనొచ్చుననే అభిప్రాయాలను కూడా వినిపిస్తున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ కార్యక్రమంలో ఆయనతోపాటు కేసీఆర్ పాల్గొంటే రాజకీయంగా సంచలనం అవుతోంది. కేసీఆర్ హాజరు కాకపోతే బీజేపీ నేతలు విమర్శలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో కేసీఆర్ మళ్లీ బీజేపీతో కలిసిపోయినట్లుగా ఎక్కువ మంది నమ్ముతారు. ఆయన జాతీయ రాజకీయాలు పలుచన అవుతాయి. దీనిని దృష్టిలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : ప్రధానితో కేసీఆర్ కాళ్ళబేరానికి దిగుతున్నారా..?