రూల్స్ అంటే ఎవరికైనా ఒకే విధంగా ఉంటాయి. అంతటి వారైనా పాటించాల్సిందే. ప్రధాని అయినా , ముఖ్యమంత్రి అయినా, వార్డు మెంబర్ అయినా రూల్స్ ను తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే పోలీసులు అన్నాక కాస్తంత అధికారం ఎక్కువే ఉంటుంది. రూల్స్ పాటించాలని చెప్పే పోలీసులకు ఎవరూ రూల్స్ పాటించాలని గుర్తుచేయరు. అందులో కమిషనర్ కు ఓ కానిస్టేబుల్ రూల్స్ గురించి చెప్పే సాహసం చేస్తుందా..? అంటే చాన్సే లేదని చెప్పాలి. కాని రూల్స్ మరిచిపోయిన కమిషనర్ కు రూల్స్ ను గుర్తు చేసింది ఓ లేడి కానిస్టేబుల్. దాంతో ఆమె చేసిన పనికి సీపీ అభినందించారు.
పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుండటంతో ఉన్నాతాధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాచకొండ కమిషనర్ చౌహాన్ ను ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్తుండగా అక్కడే డ్యూటీలోనున్న మహిళా కానిస్టేబుల్ అడ్డుకోవడం కనిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానిస్టేబుల్ సీపీని అడ్డుకోవడం ఏంటని నిర్ఘాంతపోయారు.
కానీ ఆమె సీపీని ఎందుకు అడ్డుకుందో చెప్పాక అందరూ మహిళా కానిస్టేబుల్ ను అభినందించారు. సీపీ చౌహాన్ ఫోన్ తో ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్తుండగా అడ్డుకొని సర్..పరీక్షా కేంద్రంలోకి ఫోన్ అనుమతి లేదని కానిస్టేబుల్ గుర్తు చేసింది. డ్యూటీలో ఉన్న మహిళ కానిస్టేబుల్ చేసిన పనికి ఏమాత్రం సీరియస్ కాని చౌహాన్ వెంటనే రూల్స్ ఎవరికైనా రూల్స్ నే మంచి పనిచేశావ్ అంటూ తన ఫోన్ ను సైతం ఆ కానిస్టేబుల్ కే ఇచ్చి సీపీ పరీక్ష హాలులోకి వెళ్లారు.
అనంతరం బయటకొచ్చాక తన ఫోన్ ను తీసుకొని మహిళా కానిస్టేబుల్ డేరింగ్ అండ్ కమిట్మెంట్ ను మెచ్చుకొని అభినందించారు సీపీ. విధి నిర్వహణలో ఇలాగే వ్యవహరించాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.