ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారా..? బీజేపీలో చేరాలనుకున్న కోమటిరెడ్డి ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ పదవుల్లో తనకు ప్రాధాన్యతనివ్వడం లేదనే అసంతృప్తితోనే కోమటిరెడ్డి కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే..కాంగ్రెస్ కు రాజీనామా చేయాలనుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తమ్ముడి బాటలోనే సాగుతారా అనే చర్చ కొనసాగుతోంది.
నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. దాంతో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారని అప్పట్లోనే ప్రచారం జరిగినా.. అనూహ్యంగా కోమటిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. “తెలంగాణ కాంగ్రెస్” పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే , కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచన చేస్తోన్న కోమటిరెడ్డితో మరెవరైనా కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.,
మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త పార్టీ ఆలోచన వెనక బీజేపీ అధినాయకత్వం ఉందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను వీడి కోమటిరెడ్డి బీజేపీలో చేరుతే రాజగోపాల్ రెడ్డి తరహాలోనే వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీలో చేరారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంటుంది. పైగా గతంలో బీజేపీ అగ్రనేతలతో భేటీలు.. ఆపై కాంగ్రెస్ , బీఆర్ఎస్ పొత్తు అని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనక అదృశ్య శక్తిగా బీజేపీ ఉందనే విమర్శలు వస్తాయి. అంతేకాకుండా అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళారని హస్తం పార్టీపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుందని గ్రహించే కోమటిరెడ్డితో బీజేపీ కొత్త ఏర్పాటు చేయిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి బీజేపీలో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసుకొని కొత్త పార్టీ ఏర్పాటు చేసి అంతిమ ప్రయోజనం బీజేపీకి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.