బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య పొత్తు అంటూ ప్రచారం జరుగుతోన్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ అద్యక్షుడిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు విషయంపై రాహుల్ గాంధీ కూడా క్లారిటీ ఇచ్చాక ఈ తరహ ప్రచారం ఎందుకు చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో అంటకాగుతున్నది బీజేపీనేనని… ఆ పార్టీ అక్రమ సంబంధం బయటపడుతుందనే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు అంటూ అబద్దపు ప్రచారాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎంల ట్రయాంగిల్ లవ్ స్టొరీ కొనసాగుతుందని రేవంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కీలక సమయంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని గుర్తు చేసిన రేవంత్…ఎంఐఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు ఎంఐఎం బరిలో నిలుస్తుందని అన్నారు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎంలు పైకి బద్ద శత్రువులా నటిస్తోన్నా అంతర్గతంగా మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కేసీఆర్ కు నూకలు చెల్లాయన్నారు రేవంత్. 80శాతం ప్రజలు కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. ఈ సారి బీఆర్ఎస్ కు 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. అటు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్దాలు చెబుతూ కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఎదో జరుగుతుందన్న ఆశలను కేసీఆర్ భ్రమలుగా మార్చారని మండిపడ్డారు. ప్రజాస్వామికబద్దంగా ఏర్పడిన నూతన రాష్ట్రంలో స్వేఛ్చ లేదని దుయ్యబట్టారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 20సీట్లకే పరిమితమైందని మాట్లాడుతోన్న నేతలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కు 20సీట్లు ఇస్తే పార్టీ మారుతున్నారనే ఈసారి 80సీట్లు కట్టబెట్టి అధికారంలోకి తీసుకొచ్చేందుకు జనం రెడీగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ చాట్ లో ఈమేరకు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ – కవిత, కేటీఆర్ లకు సిట్ నోటిసులు..!?