తెలంగాణలో వరుసగా పేపర్ లీక్ అవుతుండటంతో సర్కార్ విమర్శల పాలౌతుంది. టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం ఇంకా సద్దుమణగానే లేదు అప్పుడే టెన్త్ పేపర్ లీక్ కావడం ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెట్టింది. పది పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే తెలుగు పేపర్ లీక్ కాగా… రెండో రోజు హిందీ పేపర్ కూడా లీక్ కావడంతో సర్కార్ పై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కనీసం పది పరీక్షలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేరా..? అని సర్కార్ ను కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కు సంబంధించి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని కాంగ్రెస్ , బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్నారు. మంత్రి సబితా ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సమాయత్తం కాగా..పాఠశాల విద్యాశాఖ బోర్డును కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంఘం ముట్టడించింది. ఈ క్రమంలోనే పలువురు విద్యార్ధి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వామపక్ష విద్యార్ధి సంఘాలతోపాటు ఏబీవీపీ కూడా సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగారు.
టీఎస్ పీస్సీ వ్యవహారం కుదిపెస్తుండగా టెన్త్ పేపర్ లు కూడా వరుసగా లీక్ కావడంతో సర్కార్ ను కార్నర్ చేసేందుకు ప్రతిపక్షాలు దీనినొక అస్త్రంగా భావిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈ అంశంలో సర్కార్ చాలా భాద్యతయుతంగా వ్యవహరిస్తోందని ప్రకటించి విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ప్రభుత్వంపై ఒత్తిళ్ళు పెరుగుతుండటంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని సబితాను కేసీఆర్ ఆదేశించారని పొలిటికల్ సర్కిల్లో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read : బిగ్ బ్రేకింగ్ : టెన్త్ పరీక్షలు వాయిదా..?