మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ నిర్వహించిన కీలక భేటీకి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని సీఎంవో నుంచి సమాచారం వెళ్ళినా వారు జగన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డుమ్మా కొట్టడం వైసీపీ వర్గాలను విస్తుగోల్పేలా చేస్తోంది.
సీఎంతో భేటీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజినిలు గైర్హాజరు అయ్యారు. వీరిలో బుగ్గన కరోనా కారణంగా ఈ భేటీ హాజరు కాలేనని ముందుగానే జగన్ కు సమాచారం అందించగా మిగతా నేతలు మాత్రం సమాచారం ఇవ్వకుండా కీలక భేటీకి దూరంగా ఉండటం సంచలనంగా మారింది.
కొంతకాలంగా జగన్ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. అయితే ఈ సమావేశానికి ఆర్కే రాకపోవడానికి అతని కుమారుడి వివాహమే కారణమని చెబుతున్నారు. అదే నిజమైతే జగన్ ను ఈ వివాహ వేడుకకు ఎందుకు ఆహ్వానించలేదనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఒకవేళ జగన్ ను పిలిచి ఉంటె ఈ కీలక సమావేశం ఉండటంతోనే ఆర్కే కుమారుడి వివాహానికి వెళ్ళలేదా..? అంటే.. జగన్ ఆర్కే తనయుడి వివాహానికి వెళ్ళాలనుకుంటే ఆ కార్యక్రమానికి జగన్ హాజరై వర్క్ షాప్ నిర్వహించేవారు. కాబట్టి జగన్ పై అసంతృప్తి కారణంగానే కుమారుడి పెళ్లికి జగన్ ను ఆర్కే పిలవలేదని అంటున్నారు.
టీడీపీ తరుఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ నియోజకవర్గంలో వైసీపీ నేతల సహాయ నిరాకరణకు గురి అవుతున్నారు. వీటన్నింటిపై వంశీ ఆగ్రహంగా ఉన్నారు. పైగా ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వంశీని సంశయంలో పడేస్తున్నాయి. మరో కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని కూడా జగన్ నిర్వహించిన వర్క్ షాప్ కు అటెండ్ కాకపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. గుడివాడ ఎమ్మెల్యే కూడా గోడ దూకుతాడనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ పాషా, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా జగన్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. మొత్తంగా చూసుకుంటే.. ఈ ఎమ్మెల్యేల డుమ్మాలతో ఓ విషయం మాత్రం స్పష్టమైంది. కొందరు ఎమ్మెల్యేలు అధినేత జగన్ పట్ల తమ అసంతృప్తిని ఇలా వ్యక్తపరిచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.