టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ వ్యవహారం మరవకముందే మరో పేపర్ లీక్ ఘటన సంచలనంగా మారింది. సోమవారం టెన్త్ పరీక్షల ప్రారంభమయ్యాయి. పరీక్షలు మొదలైన మొదటి రోజే పేపర్ లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 9 :30 గంటలకు పది పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం లీక్ అయింది. టెన్త్ ప్రశ్నా పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. ఈ క్వశ్చన్ పేపర్ ను షేర్ చేసిన వ్యక్తి వెంటనే దానిని డిలీట్ చేశాడు కాని జీబీ వాట్సప్ లో డిలీట్ చేసినవి అలాగే ఉంటాయి. దాంతో ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది.
వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే ప్రశ్నా పత్రం వాట్సప్ లో వెలుగుచూడటం చర్చనీయాంశం అవుతోంది. తాండూర్ లోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో ప్రశ్నా పత్రం లీక్ అయినట్లు సమాచారం. కాగా అధికారులు పేపర్ లీక్ వ్యవహారంపై స్పందించారు.
ప్రశ్నాపత్రం లీకేజ్‌పై వికారాబాద్ డీఈవో వివరణ ఇచ్చారు. తమ జిల్లాలో ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ అవలేదని చెబుతున్నారు. పేపర్ లీక్ కాకపోతే పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నా పత్రం వాట్సప్ లో ఎలా వెలుగుచూసిందన్నది ప్రశ్న. క్వశ్చన్ పేపర్ వాట్సప్ లోకి ఎలా వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా అధికారులు లీక్ వ్యవహారాన్ని కొట్టిపారేస్తే ఎలా అని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మరి ప్రశ్నాపత్నం లీకేజ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.