కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్దవిరమణ చేసినట్లు కనిపిస్తోంది. సందర్భం ఏదైనా కానీ మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించే కేసీఆర్ మునుపటి దాడిని కొనసాగించడం లేదు. కారణమెంటో తెలియదు కాని కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
తాజాగా మహారాష్ట్ర నేతలు వచ్చి బీఆర్ఎస్ లో చేరే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. వారికీ పార్టీ కండువా కప్పి కేసీఆర్ సాదరంగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇదంతా బాగానే ఉంది కానీ కాసేపయ్యాక లైవ్ ను ఆపేయాలంటూ కేసీఆర్ ఆదేశించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
సాధారణంగా తెలంగాణ భవన్ లో జరుగుతోన్న కార్యక్రమాలకు మీడియాను అనుమతించడం లేదు. ఏస్ మీడియా అనే ఏజెన్సీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఒక్క కెమెరామెన్ మాత్రమే లోపల ఉంటారు. శనివారం మహారాష్ట్ర నేతలు పార్టీలో చేరిక తరువాత కేసీఆర్ మాట్లాడుతోన్న సమయంలోనే సడెన్ గా కెమెరామెన్ ను లైవ్ ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశించారు. అక్కడి వరకు మాత్రమే లైవ్ వచ్చింది. ఆ తరువాత కేసీఆర్ ఏం మాట్లాడరన్నది బయటకు రాలేదు.
కేసీఆర్ అప్పటివరకు కేంద్రంపై విమర్శలు చేయలేదు. నీతి , నిజాయితీతో రాజకీయాలు చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని పార్టీలో చేరిన నేతలకు సలహాలు ఇచ్చారు. బీఆర్ఎస్ తో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పార్టీ పటిష్టత కోసం పని చేయాలని దిశా నిర్దేశనం చేశారు. సంవత్సరంపాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే వారిపై ఉగ్రవాదుల ముద్ర వేశారు. ఆఖరికి రైతుల పోరాటానికి దిగివచ్చి రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పారు. ఇలా కాసేపు మాట్లాడిన కేసీఆర్ ఎక్కడ కూడా మోడీని వ్యక్తిగతంగా విమర్శించలేదు.
సరిగ్గా మోడీని విమర్శించే సమయానికి లైవ్ ఆపేయాలని కెమెరామెన్ కు కేసీఆర్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో నేరుగా ప్రధాని మోదీకి కేసీఆర్ హ్యండ్సప్ చెప్పినట్లుగా అర్థం అవుతోంది.
Also Read : ప్రధానితో కేసీఆర్ కాళ్ళబేరానికి దిగుతున్నారా..?