మహేశ్వరం రాజకీయం సెగలు కక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ముగ్గురు పోటీపడుతుండటంతో రాజకీయం యమ రంజుగా మారింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి , కొత్త మనోహార్ రెడ్డిలు మహేశ్వరం నియోజకవర్గం నుంచి టికెట్ కోరుతున్నారు. కానీ ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికీ దక్కుతుందని నియోజకవర్గామంత ఏడతెగని చర్చ జరుగుతోంది.
2018లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీగల కృష్ణారెడ్డిని ఓడించారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారారు సబితా. మహేశ్వరం బీఆర్ఎస్ టికెట్ టికెట్ కోసం కొత్త మనోహర్ రెడ్డి కూడా పోటీ పడ్డారు. కాని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేయడంతో కొత్త మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల తరుఫున ప్రచారం నిర్వహించారు. కానీ తీగల ఓటమి పాలయ్యారు.
తీగల ఓటమి.. సబితా బీఆర్ఎస్ లో చేరిక ఆపై మంత్రిపదవి దక్కడంతో నియోజకవర్గమంతా సబితమ్మ హవానే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ లకే మరోసారి అవకాశం ఇస్తామనే కేసీఆర్ ప్రకటనతో తీగల డైలమాలో పడిపోయారు. తన పరిస్థితి ఏంటని పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే ఎలాగూ టికెట్ దక్కే పరిస్థితి లేదని ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గతేడాదే పార్టీ మారేందుకు తీగల రెడీ అయినా కేటీఆర్ ఎంట్రీతో ఆగిపోయారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నచ్చజెప్పి పార్టీ మార్పుకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అటు తీగల, ఇటు కొత్త మనోహర్ రెడ్డిలకు హామీ ఇచ్చినా ఇద్దరికీ ఏ పదవి ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో తీగల, కొత్త మనోహర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా? ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తారా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో చేరనున్నట్లు పరోక్ష సంకేతాలు పంపిన తీగల.. పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు. అధిష్ఠానం తనకు న్యాయం చేయకపోతే బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. కాగా కొత్త మనోహర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
Also Read : టీడీపీలోకి ఇందిరా శోభన్..?