తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2023 -24విద్యా సంవత్సరం జూన్ 12నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వేసవి సెలవులను ప్రకటించడంతో పాఠశాల వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది విద్యాశాఖ. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. పరీక్షల అనంతరం 21తేదీ నుంచి 24వరకు పరీక్షల మూల్యాంకనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
వేసవి సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండ ధాటికి తట్టుకోలేక చాలామంది పిల్లలు సరదాగా ఈత కోసం చెరువుల వద్దకు వెళ్తుంటారు. వారితో ఎవరైనా పెద్దలు తోడుంటేనే ఈతకు వెళ్ళనివ్వాలి. లేదంటే పిల్లలను బయటకు పంపించవద్దు. అలాగే మధ్యాహ్నం సమయంలో ఆడుకోకుండా చూడాలి. ఎందుకంటే ఎండకు వడదెబ్బ తగిలి పిల్లలు అస్వస్థతకు గురి అవుతారు. కనుక పిల్లలను వేసవి సెలవుల్లో జాగ్రత్తగా చూసుకోవాలి.
వేసవి సెలవులను సరదాగా గడిపేయందుకే వాడకూడదు. ఏదైనా కోర్సు నేర్చుకునేందుకు పంపించాలి. కంప్యూటర్ శిక్షణ కోసం, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల కోసం పంపించాలి. ఇలా చేయడం వలన విద్యార్థులు ఎండకు వెళ్ళకుండా నివారించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా కోర్సులో నైపుణ్యం అందించిన వాళ్ళం అవుతాం.