భారత ప్రజాస్వామ్య విలువలు పతనం అంచుకు చేరుతున్నాయి. గత నెలలుగా జరుగుతోన్న పరిణామాలను గమనిస్తే ఈ విషయం సులభంగానే అర్థం అవుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని వాగ్దానం చేసిన పాలకులు భేషుగ్గా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. అధికారమదంతో ప్రజాస్వామ్యాన్నికి చితులు పేర్చుతూ భారత ప్రజాస్వామ్యాన్ని దేశ ప్రజల ముందే ఖననం చేస్తున్నారు. ఇంత జరుగుతోన్న ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన లేకపోవడం బాధాకరం. ప్రజలను ఓ నిషలో ముంచి పాలకులు తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల ముందు భారత ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణే రాహుల్ గాంధీపై అనర్హత వేటు.
భారతదేశ ప్రజాస్వామ్య విలువల గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటుంది. ప్రజాస్వామ్య దేశాలకు భారత్ తల్లి లాంటిదని కొనియాడుతారు. అలాంటి ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. పాకిస్తాన్ తరహ ప్రజాస్వామ్యం ఇండియాలో కనిపిస్తోంది. నిన్నటిమొన్నటిదాక ప్రధానిగా నున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదంలో ఉన్నాడు. ఆయనకు జైలు శిక్ష పడింది. జైలుకెళ్ళడమే తరువాయి. ముషారఫ్… నవాజ్ షరీఫ్ ఇలా అందరూ.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవారే. ఎదుర్కోవడమే కాదు సృష్టించినవారు కూడా.
పాక్ న్యాయస్థానాలు ఎప్పడు ఎవరికీ వ్యతిరేకంగా తీర్పులు ఇస్తాయో తెలిదు. ఓ కోర్టు ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తుంది. మరో కోర్టు దానిని కొట్టేస్తుంది. అక్కడ సుప్రీంకోర్టు అధికారాలను కత్తిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రత్యర్ధుల్ని ఎలిమినేట్ చేయడానికి ఆ దేశ ప్రజాస్వామ్య విలువలను చీలికలు పేలికలు చేస్తున్నారు. ఫలితంగా పాకిస్తాన్ ఓ సంక్షోభంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాలోనూ కనిపిస్తోంది. తమ అనుకూలురు ఎంత అవినీతికి పాల్పడినా, అక్రమాలు చేసినా , అవినీతి చేసినా చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వ పెద్దలు. కానీ తమను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్ధులను చిన్న , చిన్న విషయాల్లో వేధిస్తున్నారు. తమను ఇరుకునపెడుతోన్న ప్రత్యర్ధులను చట్టసభల్లో నుంచి బహిష్కరించడానికి వ్యవస్థలను కూడా వాడుకుంటున్న స్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేశారు. నిజానికి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాల్సినంత సీరియస్ కేసేమి కాదది. ఆ కేసు నేపథ్యం.. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నియామకం పరిశీలిస్తే భారత ప్రజాస్వామ్య విలువలను ఎంత పలుచన చేస్తున్నారో చెప్పొచ్చు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణం… అదాని- మోడీల మైత్రిని బయటపెట్టడమే. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అదాని కుంభకోణాల గురించి ప్రశ్నిస్తున్నందుకే అనర్హత వేటు పడిందని ఘంటాపథంగా చెబుతున్నారు. మెజార్టీ దేశ ప్రజలు ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు కూడా. రాహుల్ గాంధీ మాటలను పరిగణనలోకి తీసుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. అదాని వ్యాపారం అంత భోగస్ అని హిండెన్ బర్గ్ నివేదిక జనవరి 24న బయటకొచ్చింది. అప్పటి నుంచి రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు. విపక్షాలు కూడా పార్లమెంట్ లో రాహుల్ కు మద్దతుగా నిలిచాయి. ఇదే విధంగా రాహుల్ మాట్లాడితే మొదాని విషయం దేశవ్యాప్తంగా మరింత హైలెట్ అవుతే ఎలా అని బీజేపీ ఆందోళన చెందింది.
మోడీ ఇంటి పేరుతో రాజకీయ విమర్శ చేసిన రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసింది బీజేపీ ఎమ్మెల్యే పూర్నేష్ మోడీ. ఈ కేసులో మొదటి విచారణ జడ్జి పేరు A.N. దవే. ఈ కేసులో 2021జూన్ 24న తన స్టేట్మెంట్ ను రాహుల్ గాంధీకి కోర్టుకు సమర్పించారు. 2022లో ఈ కేసులో రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని పూర్నేష్ మోడీ జడ్జి దవేను అభ్యర్థించగా ఇందుకు నిరాకరించారు. ఆ తరువాత సూరత్ కోర్టులో కేసు విచారణను ఆపే ఆదేశాలు ఇవ్వమని పూర్ణేష్ మోడీ హైకోర్టులో 2022 మార్చి ఏడో తేదీన పిటిషన్ వేశారు. దీంతో విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే 2023మొదట్లో జడ్జి దవే ను బదిలీ చేసిన అనంతరం విచారణపై స్టే ను ఎత్తివేయాలంటూ అదే పూర్నేష్ మోడీ హైకోర్టులో ఫిబ్రవరి 16న పిటిషన్ వేశారు. ఇదంతా హిండెన్ బర్గ్ రిపోర్ట్ బయటకొచ్చిన తరువాత. అదాని- మోడీల బంధంపై రాహుల్ గాంధీ కామెంట్స్ చేసిన తరువాత అనూహ్యంగా జడ్జిని బదిలీ చేసి విచారణ మళ్ళీ కొనసాగించేలా పూర్నేష్ మోడీ ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఎప్పుడైతే అదాని ఇష్యూపై రాహుల్ గాంధీ వరుసగా మాట్లాడటం స్టార్ట్ చేశారో అప్పటి నుంచే ఈ కేసును మళ్ళీ కదలించడం పూర్నేష్ మోడీ స్టార్ట్ చేశారు. సూరత్ కోర్టులో జడ్జి దవే స్థానంలో H.H వర్మ అనే జడ్జిని నియమించారు. ఈ నియామకం కూడా హిండెన్ బర్గ్ నివేదికపై రాహుల్ అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నాకే జరిగింది. H.H వర్మ నేతృత్వంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో స్పందించి శిక్ష విధించారు. ఈ కేసు వివరాలను పూర్తిగా పరిశీలిస్తే ఒకదానికొకటి లింక్ చేసి ఉన్నట్లు ఈజీగా అర్థం అవుతోంది. అంటే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం వెనక వ్యవస్థలను కేంద్రం మేనేజ్ చేసిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
రాహుల్ గాంధీ నోరు మూయించడానికి వ్యవస్థలను కూడా వాడుకొని కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగ విలువలను మంటగలుపుతోంది. ఇదే పరంపర కొనసాగితే రాజకీయాలు మరింత కలుషితం అవుతాయి. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల ముందు అభాసుపాలు అవుతోంది. ప్రజాస్వామ్యానికి చితులు పేర్చుతోన్న బీజేపీ నుంచి ఇక ఈ దేశాన్ని ప్రజలే కాపాడుకోవాలి.