ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆమె ఫోన్లలోని డేటాని రికవరీ చేసి పరిశీలించిన అనంతరం కవితకు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కవిత తరుఫు న్యాయవాది సోమా భరత్ సమక్షంలో కవిత ఫోన్లను ఓపెన్ చేసిన అధికారులు ఆమె ఫోన్లో డిలీట్ అయిన డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. కవిత ఈడీ అధికారులకు సమర్పించిన పది ఫోన్లలోని డేటాను మొత్తం సేకరించిన తరువాత ఆమెకు మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఏమాత్రం అత్యుత్సాహం ప్రదర్శించకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నది ఈడీ. రాజకీయ పరమైన కేసు కావడంతో స్మూత్ గా ఈ కేసును డీల్ చేస్తోంది.
కవిత తమకు సమర్పించిన ఫోన్లలో డేటా రికవరీ చేయనున్నామని మంగళవారం ఈడీ కవితకు లేఖ రాసింది. ఇందుకోసం ఈడీ ఎదుట మీరైన హాజరు కావొచ్చు..మీ తరుఫున మరెవరినైనా పంపొచ్చునని తెలియజేయడంతో కవిత తన తరుఫు న్యాయవాది సోమ భరత్ ను మంగళవారం పంపింది. ఆయన సమక్షంలోనే కవిత ఫోన్ల డేటాను రికవరీ చేసే పనిని ఈడీ స్టార్ట్ చేసింది. మొదటి రోజు మూడు ఫోన్ల డేటాని రికవరీ చేసిన అధికారులు బుధవారం మరో రెండు ఫోన్లను ఓపెన్ చేశారు. మరో ఐదు ఫోన్లు ఓపెన్ చేయాల్సి ఉండటంతో కవిత తరుఫు న్యాయవాదిని మరో రెండు రోజులు ఈడీ ఆఫీసుకు రావాలని తెలిపింది.
ఈ ఫోన్లలో మొత్తం డేటాను రికవరీ చేసిన తరువాత… ఫోన్లలో సంపాదించినా ఆధారాల ఆధారంగా కవితను తదుపరి ప్రశ్నించనుంది ఈడీ. కవిత డేటాను మొత్తం బయటకు తీసుకురాగలిగితే కీలక సమాచారం అంత బయటకోస్తుందని ఈడీ నమ్ముతోంది. కవిత ఎవరెవరితో లిక్కర్ స్కామ్ విషయమై చర్చలు జరిపింది..? ఎక్కడెక్కడ నిందితులతో కవిత సంప్రదింపులు జరిపింది..? డాక్యుమెంట్స్ షేరింగ్.. వాట్సప్ చాట్… ఇలా వీటన్నింటి ఆధారాలు కవిత ఫోన్లలో డేటాను రికవరీ చేయడం ద్వారా లభ్యం అవుతాయని ఈడీ అంచనా వేస్తోంది.
అందుకే ఈకేసులో కవిత ఫోన్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే డేటా రికవరీలో ఫుల్ బిజీగా మారింది ఈడీ. ఈ డేటాను పూర్తిగా స్టడీ చేసిన తరువాత విశ్లేషణ చేసి వీటి ఆధారంగా కవితను ప్రశ్నించనుంది ఈడీ.
Also Read : లిక్కర్ స్కామ్ లో నాలుగోసారి విచారణకు కవిత – జరిగేది ఇదేనా..?