ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రుల పనితీరుతో అసంతృప్తిగానున్న జగన్…అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుత క్యాబినెట్ తో ఎన్నికలకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలను సరైన రీతిలో తిప్పికొట్టడంలో కొంతమంది మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ ఇచ్చి వారి నోరు మూయించాలని జగన్ ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. కాని ఎవరూ ప్రతిపక్షాలకు సరైన కౌంటర్లను పేల్చలేకపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలను వివరించడంలో కొంతమంది మంత్రులు విఫలం అవుతున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే మరోసారి క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని జగన్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ చేపట్టిన జగన్..ఇదే టీంతో ఎన్నికలకు వెళ్తామని అప్పట్లో స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇటీవల గవర్నర్ తో జగన్ భేటీ కావడం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కోసమేనని సమాచారం. రెండు రోజుల్లో అంటే శుక్రవారమే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానిని తిరిగి మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. అదే విధంగా గతంలో మంత్రిపదవి నుంచి తొలగించిన బాలినేనిని కూడా చేర్చుకునే అవకాశం ఉండగా.. కొత్తగా తోట త్రిమూర్తులకు జగన్ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే, నెల్లూరులో తలెత్తిన రాజకీయ మంటలను కూడా అదుపు చేయాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా.. సీఎం జగన్ మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేయనున్నారని అంటున్నారు.
Also Read : జగన్ కు ఉండవల్లి శ్రీదేవి రిటర్న్ గిఫ్ట్ – ఏంటో తెలుసా..?