తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయి. అప్పుడే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాట్లపై చర్చిస్తున్నాయి. కూడికలు, తీసివేతలతో పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఎలక్షన్ రేస్ లో అధికార బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు మంత్రులను కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలనుకుంటున్నారనే టాక్ హాట్ హాట్ గా సాగుతోంది.
ఎన్నికలకు మరెంతో సమయం లేదు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేపడుతు నివేదికలు తెప్పించుకుంటున్నారు. సర్వే రిపోర్ట్ ల ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రులను పనితీరు మార్చుకోవాలని కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. పనితీరు ఏమాత్రం బాగోలేని వారిని హెచ్చరిస్తున్నారు.
ఎమ్మెల్యేల విషయాన్ని పక్కనబెడితే ఇద్దరు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ అనుమానమేనని తెలుస్తోంది. మరో మంత్రి తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులలో ఒకరు 2004 నుంచి వరుసగా గెలుస్తోన్న నేత కాగా.. మరొకరు 2009నుంచి గెలుస్తోన్న నేత అని తెలుస్తోంది. ఈ ఇద్దరినీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పక్కన పెట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ఈ ఇద్దరు మంత్రులను తప్పించి అక్కడ ప్రత్యామ్నాయ నేతకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అక్కడ ప్రతిపక్ష నేత విజయానికి చేరువలో ఉన్నారని కేసీఆర్ కు అందిన సర్వే రిపోర్ట్ లో తేలడంతో ..ఆ నియోజకవర్గాల్లో మరో బలమైన నేత ఎవరున్నారు..? ఏ సామజిక వర్గానికి అక్కడ పట్టుంది..? గెలుపుకు దగ్గరనున్న ప్రతిపక్ష పార్టీ నేత బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారా..? అనే విషయాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు మంత్రులపై వేటు తప్పదనే విషయం లీక్ కావడంతో ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రుల్లో గుబులు పట్టుకుంది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరా? అని ఆరా తీస్తున్నారు. అయితే ఎన్నికల సమయం నాటికి ఎవరా అని తేలిపోనుందని పార్టీ నాయకులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎర్రబెల్లి 25 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర చర్చ సాగుతోంది.