పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. కాల్పుల శబ్దం రావడంతో జనమంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాల్పులకు ఎవరు పాల్పడ్డారు..? అని పోలీసులు విచారించగా భరత్ యాదవ్ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. దిలీప్ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలో తేడాలు రావడంతోనే ఈ కాల్పులు భరత్ యాదవ్ జరిపినట్లుగా తెలుస్తోంది.
భరత్ యాదవ్ ని వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారించింది. వివేకా హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భరత్ పదేపదే చెబుతుంటారు. ఆస్తుల తగాదాలతోనే ఆయన్ను హత్య చేశారని ఆరోపిస్తుంటారు. ఇందుకు వైసీపీ అనుకూల మీడియా తెగ కవరేజ్ ఇస్తుంది. తనకు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని .. తనకు ఏమైనా అయితే రాజశేఖర్ రెడ్డిదే బాధ్యత అని మీడియా ముంగిట చెబుతుంటారు.
వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు భరత్ నుంచి అపాయం ఉందని సీబీఐకి కంప్లైంట్ కూడా చేశాడు. తనను కలిసేందుకు భరత్ ఇంటికి వస్తాన్నారని… అవినాష్ రెడ్డి కలవాలనుకుంటున్నారని దస్తగిరి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. వీటిపై భరత్ సంచలన ఆరోపణలు చేశారు. దస్తగిరిని సీబీఐ వాళ్ళు వేధింపులకు గురి చేశారని దర్యాప్తు సంస్థపైనే ఆరోపణలు చేశారు. దస్తగిరి డ్రామాలు ఆడుతున్నాడని అంటున్నారు.
తాజాగా పులివెందులలో జరిగిన కాల్పులు భరత్ చేసినవేనని తేలింది. దాంతో వివేకా హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆర్థిక అంశాలపై తేడా రావడంతోనే ఈ కాల్పులు జరిపాడా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు