”మల్లా రెడ్డి నిజంగానే హౌల గాడు, అతని మాటలు పట్టించుకోవద్దు” అని కాంగ్రెస్, బీజేపీ నాయకులే కాదు, చివరికి బిఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటారు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఆ మాటలు నవ్విస్తాయి. అతను ఏం చేస్తాడో తెలియదు. కానీ ఓ మంత్రిగా ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది.
చిరంజీవి లాంటి ఆక్షన్ హీరోలా సినిమాలల్లో బ్రమ్మానందం లాంటి కమేడియన్ ఉంటాడు. సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో ఒక్కసారిగా నవ్వులు విరబూయాలంటే కమేడియన్ అవసరం. అలాగే సీరియస్ గా సాగే రాజకీయ సభలలో మల్లా రెడ్డి కూడా ఓ కమేడియన్ లాగా జనాన్ని గొల్లున నవ్విస్తాడు. అందుకే కేటిఆర్ తన సభలలో మల్లా రెడ్డిని కావాలని పిలిపించి మైక్ ఇస్తాడు. ఇంకే? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే. కానీ ఇప్పటివరకు కమేడియన్ లా ఉన్న మల్లా రెడ్డి ఇప్పుడు ‘పిట్టల దొరలా’ మారాడు.
అందుకే నిన్న జరిగిన ‘మేము ఫేమస్’ సినిమా ప్రమోషన్లో భాగంగా మల్లా రెడ్డి మాట్లాడుతూ ”నన్ను విలన్ గా నటించమని పవన్ కళ్యాణ్ బతిమాలిండు. కానీ నేను విలన్ వేషం చేయను అని రిజెక్ట్ చేసిన. నేను హీరో వేషమే వేస్తాను” అని తన డబ్బా తానే కొట్టుకున్నాడు. కానీ చివర్లో ఓ నిజం ఒప్పుకున్నాడు. ”నేను హీరో వేషం కడితే ఎవ్వరు సినిమా చూడరు” అన్నాడు. అది నిజమే మరి.
ఇంటింటికి తిరిగి పాలు పోసే ఓ నిరుపేదగా జీవితం మొదలు పెట్టిన మల్లా రెడ్డి ఓ మంత్రిగా ఎదగడం అభినందనీయమే. మెడికల్ కాలేజీలు కట్టి ఎందరో డాక్టర్ లను, మేధావులను తయారుచేసిన అతని టాలెంటును మెచ్చుకోక తప్పదు. అతనికి కష్టాలు తెలుసు. కస్టాలు అనుభవించి పైకి వచ్చిన చదువురాని మేధావి. అంతా బాగానే ఉంది. ఆయన గొప్పతనం గురించి పక్కవాడు మెచ్చుకోవాలి.
కానీ తన డబ్బా తానూ కొట్టుకోరాదు అనే చిన్న లాజిక్ మరిచాడు. అందుకే సభలో ‘నేను చాలా గొప్ప మేధావిని. నన్ను చూసి బాగుపడండి. మీకు తెలివి లేదు. చినిగి పోయిన జీన్ ప్యాంట్లు వేసుకుని తిరిగితే నాలా జీవితంలో పైకిరారు. నన్ను చూసి బాగుపడండి’ అని యువతను ఎద్దేవా చేశాడు.
ఇదెక్కడి సంస్కారం అని యువకులు పక్కున నవ్వుకుని ‘మల్లా రెడ్డి హౌలాగాడు. ఆ మాటలు పట్టించుకోవద్దు’ అని దులిపేసుకుని వెళ్లిపోయారు. కమేడియన్ లాగా నవ్వించడం వేరు. నవ్వులపాలు కావడం వేరు అని మన మల్లా రెడ్డి సార్ ఎప్పుడు తెలుసుకుంటడో ఏమా?