ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా పని చేసి రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డీఎస్ ఇప్పుడు కుమారుల రాజకీయంతో సతమతం అవుతున్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తిరిగి సోమవారం ఆయన పేరుతో విడుదల లేఖలో మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదని.. పార్టీలో చేరినట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ లేఖలో ప్రకటించారు.
తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగానే గాంధీ భవన్ కు వెళ్లాను తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాదని ఆయన పేరిట విడుదలైన లేఖలో పేర్కొన్నారు. గాంధీ భవన్ కు వెళ్తే అక్కడ అభిమానంతో తనకు కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్ …తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారు.
ప్రస్తుతం డీఎస్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నారు. అయినప్పటికీ గాంధీ భవన్ కు వచ్చి రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. తాను మరణించినా తన భౌతికకాయంపై కాంగ్రెస్ జెండాను కప్పాలంటూ ఉద్వేగంగా మాట్లాడారు. కాని మరుసటి రోజే సీన్ మారిపోయింది.
డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిన్న కుమారుడు అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీఎస్ ఆయనతోపాటే ఉంటున్నారు. అందుకే సంజయ్ తన సొదరుడిపై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా డీఎస్ పేరిట విడుదలైన లేఖ ఉత్తదేనని.. ఆయనతో అయిష్టంగా సంతకం చేయించారని సంజయ్ ఆరోపిస్తున్నారు. తన తండ్రితో మాట్లాడనియ్యడం లేదని చెప్పుకొచ్చారు.
ఇదంతా అరవింద్ డ్రామా అని ఆరోపించారు సంజయ్. మొత్తంగా డీఎస్ ఇద్దరు కుమారుల మధ్య సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది.