టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారి ఎ.ఆర్ .శ్రీనివాస్ ఈ సిట్ కు అనర్హుడా..? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్షతోపాటు జరినామా పొందిన అధికారికి ఇంతటి కీలకమైన కేసును ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. జైలు శిక్ష పడకుండా శ్రీనివాస్ తెచ్చుకున్న స్టే గడువు కూడా ముగిసిందన్నారు. అంతేకాదు ఎ.ఆర్ శ్రీనివాస్ నియామకం వెనక కుట్ర కోణం ఉందని జడ్సన్ ఆరోపిస్తున్నారు.
పలు కేసుల్లో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన సిట్ లకు తమ అనుకూలురును చైర్మన్ లుగా నియమించేసి కేసు మొత్తాన్ని ప్రభుత్వం డైవర్ట్ చేసిందని జడ్సన్ అన్నారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఏర్పాటు చేసిన సిట్ కు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ భర్త ఆకున్ సబర్వాల్ ను నియమించి ఆ కేసును మూసివేశారని గుర్తు చేశారు. ఓ కేసులో జైలు శిక్ష పొందాల్సిన ఎ.ఆర్ శ్రీనివాస్ ను సిట్ కు చైర్మన్ గా నియమించి ఇప్పుడు పేపర్ లీకేజీ కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అధికారులను సిట్ చైర్మన్ గా నియమిస్తే అన్ని వ్యవహారాలు బయటకోస్తాయని విజయవాడకు చెందిన అధికారిని సిట్ చైర్మన్ గా నియమించారన్నారు.
హైదరాబాద్ ప్రాంత నివాసి అయిన ఎన్నారై కుటుంబ తగాదాలో నిర్లక్ష్యం వహించి, చట్టాలకు వ్యతిరేకంగా కేసులు బనాయించిన సంఘటనలో నాడు వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ గా నున్న ఎ.ఆర్ శ్రీనివాస్ కు కోర్టు ధిక్కరణ నేరం కింద రెండు నెలల జైలు విధించింది. ఆ తరువాత ఈ తీర్పు అమలుపై ఆయన స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ స్టే గడువు కూడా ముగిసిందని జడ్సన్ అన్నారు. అంటే జైలు శిక్ష పొందాల్సిన ఎ.ఆర్ శ్రీనివాస్ కు తెలంగాణను మొత్తం కుదిపెస్తోన్న పేపర్ లీక్ కేసును అప్పగిస్తారా అని జడ్సన్ ప్రశ్నిస్తున్నారు. దీని వెనక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.
పేపర్ లీక్ విషయంలో సిట్ తో ఒరిగేదేం ఉండదని…సీబీఐ విచారణతోనే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. ఇప్పటీ పేపర్ లీక్ కు మూలాలు 2016లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో ఉన్నాయని ఆరోపించారు. సిట్ దర్యాప్తు 2016నుంచి నిర్వహించిన పరీక్షల నుంచిప్రారంభించాలని కానీ అలా చేయడం లేదని అన్నారు. ఎందుకంటే దీనిక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ప్రస్తుతం జడ్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఓ యూ ట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.