కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు అని, రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు కోసం పార్లమెంట్ ను సైతం వాడుకున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో విపక్షాలన్నీ రాజకీయ విబేధాలను పక్కనపెట్టేశాయి. ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలో ఐక్యం కావాలని నిర్ణయించుకున్నాయి. బీఆర్ఎస్ సహా ఆప్, వామపక్షాలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), రాష్ట్రీయ జనతాదళ్ ఇలా దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండించాయి. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశాన్ని రక్షించాలనుకునే వారు బీజేపీని వీడాలంటూ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన విపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించడం ఎవర్ని ఆశ్చర్యపరచలేదు కానీ బీఆర్ఎస్ రాహుల్ కు సంఘీభావం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ , బీజేపీ ముక్త్ భారత్ అంటూ జాతీయ స్థాయి రాజకీయాలు ప్రారంభించారు కేసీఆర్. మోడీని చీల్చిచెండాడుతునే కాంగ్రెస్ ను కూడా విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్ ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లిక్కర్ స్కామ్ లో కూతురు కవితకు కాంగ్రెస్ మద్దతు కూడగట్టేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ మీద ఒంటరిగా పోరాడం చేతకాక కాంగ్రెస్ సహకారంతో ముందుకు సాగాలనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చునని అంటున్నారు.
మరోవైపు రాహుల్ గాంధీపై కేసీఆర్ సంఘీభావం తెలపడంతో తెలంగాణ బీజేపీ మరోసారి పొత్తు చర్చలను తెరపైకి తీసుకొస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమని అందుకే రాహుల్ గాంధీని దువ్వె పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారని ఆరోపిస్తున్నారు. బీజేపీ చేస్తోన్న ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. స్వయంగా రాహుల్ గాంధే బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పాక కూడా ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాన్ని చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీని విమర్శించారు.