ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తు నిర్ణయం తీసుకుంది.
వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేయడంతో ఆమె గెలుపొందారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరై ఉండొచ్చునని గురువారం ఫలితాలు వెలువడిన తరువాత నుంచి అధిష్టానం ఆరా తీసింది. అయితే ఆ నలుగురిలో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలుగా వైసీపీ అధిష్టానం గుర్తించింది. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ పై అంతర్గత విచారణ చేసినట్లు చెప్పారు సజ్జల. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారని తేలడంతోనే ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వేటు వేసినట్లు తెలిపారు. క్రాస్ ఓటింగ్ వేస్తె వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే ఈ నలుగురు టీడీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించారని ఆరోపించారు. పంచుమర్తి అనురాధకు ఓటేసి గెలిపిస్తే ఒక్కో ఎమ్మెల్యేకు 15నుంచి 20కోట్లు ఇస్తానని చంద్రబాబు ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారుల.
అయితే.. ఉండవల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని మీడియా ఎదుట చెప్పారు. గురువారం ఉదయం కుమార్తెతో కలిసి జగన్ ను కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నానని అలాంటి తనకు క్రాస్ ఓటింగ్ వేయాలనే ఆలోచన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కానీ వైసీపీ చేసిన దర్యాప్తులో ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసినట్లు తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు. పార్టీ విధించిన సస్పెన్షన్ పై ఆమె ఎలాంటి స్పందన వ్యక్తం చేశారో చూడాలి.
వైసీపీలో నాలుగు వర్గాలకు విభజించి పాలించే ప్రయత్నం చేశారని అధిష్టానంపై ఫైర్ అయ్యారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలుద్దామన్న అపాయింట్ మెంట్ దొరకదని.. నిధులు విడుదల చేయాలని కోరితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారని చెప్పారు. వైసీపీ అధిష్టానం తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. వైసీపీ అధిష్టానం చెప్పిన వెంకటరమణకే ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించానన్నారు. టిక్కెట్టు ఇస్తే గెలిచి చూపిస్తా… ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా అంటూ వ్యాఖ్యానించారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు టీడీపీకి ఓటేసినట్లు తేలడంతో వారిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణరెడ్డి ప్రకటించారు. దీనిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి.