గోవా. ఇండియాలో మంచి పర్యాటక ప్రదేశం. ఇక్కడ మద్యం చాలా చౌకగా లభిస్తుంది. అందుకే తిరుగు ప్రయాణంలో పర్యాటక ప్రియులు మద్యం బాటిళ్ళను వెంట తీసుకెళ్తుంటారు. కాగా గోవా నుంచి అన్ని రాష్ట్రాల వారు మద్యం బాటిళ్ళను తీసుకెళ్లవచ్చా..? ఏమైనా ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయా..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
గోవా నుంచి ఏపీకి మద్యం బాటిళ్ళను అసలే అనుమతించరు. ఏపీలో ప్రత్యేకమైన మద్యం పాలసీ ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం రవాణాకు అనుమతి లేదు. గోవా నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ మార్గంలోనైతే ఒక్కో వ్యక్తికి ఐదు లీటర్ల చొప్పున మద్యాన్ని చెక్ ఇన్ బ్యాగ్ లో తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తారు. హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం తీసుకువెళ్లేందుకు అనుమతించరు. కాదు.. కూడదని అతి తెలివి ప్రదర్శించి ఐదు లీటర్ల కన్నా ఎక్కువ మద్యాన్ని హ్యాండ్ బ్యాగ్ లో తీసుకువెళ్దామని అనుకుంటే కస్టమ్స్ అధికారులు పట్టేస్తారు. మద్యాన్ని అక్కడే పారబోస్తారు.
24 నుంచి 70 శాతం మధ్య ఉన్న లిక్కర్‌కు మాత్రమే ఈ 5-లీటర్ పరిమితి వర్తిస్తుంది. ఎవరైనా తీసుకువెళ్ళే లిక్కర్లో ఆల్కహాల్ పర్సెంట్ 24% కంటే తక్కువగా ఉంటే, అప్పుడు 5-లీటర్ రూల్ ఉండదు. ఎక్కువ కూడా తీసుకువెళ్ళొచ్చు. అలాగే మందు లీకేజ్ అనేది ఉండకూడదు. సీల్ బాటిల్స్ అయి ఉండాలి.
ఇక బస్సులు, ప్రైవేట్ వాహనాలు అయితే రెండు కంటే ఎక్కువ మద్యం బాటిళ్ళను తీసుకు వెళ్తే అక్కడి అధికారులు పట్టుకుంటారు. అయితే ఈ రెండు బాటిల్స్ కూడా తీసుకు వెళ్లేందుకు మొదట అనుమతి తీసుకోవాలి. అథారిటీ కలిగిన డీలర్ లేదా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి 20 రూపాయలు( ఒక్కో బాటిల్‌కు 10) చెల్లించి తీసుకున్న పర్మిట్ స్లిప్ తీసుకోవాలి.
అయితే.. అన్ని రాష్ట్రాల్లో మద్యం బాటిళ్ళను తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదు. మహారాష్ట్ర , కర్ణాటక ఈ 2 రాష్ట్రాలు గోవాకు సమీపాన ఉన్నందున అక్రమ మద్యం రవాణాను నిలువరించేందుకు ఆయా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి.