ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఫేక్ డిగ్రీ సంపాదించి ఎల్ఎల్ బీ ప్రవేశం పొందారని తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై అత్యున్నత స్థాయి విచారణకు ఆయన డిమాండ్ చేశారు.
తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తరువాత లాకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలనుకున్నారు. అందుకేనేమో ఎల్ఎల్ బీ చదవాలనుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని లా కాలేజ్ లో ప్రవేశం పొందారు. ఆయన లా కోర్స్ లో ప్రవేశం పొంది మూడేళ్ళు అయిపోయింది. పరీక్షలు రాశారో లేదో క్లారిటీ లేదు. కాని ఆయన డిగ్రీ పాస్ కాకుండానే మూడేళ్ళ లా విద్యను ఎలా అభ్యసిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది.
ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేయడానికి అర్హులు. కానీ డిగ్రీని మధ్యలోనే ఆపేసినట్లుగా తమ్మినేని సీతారాం తన ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నారు.
డిగ్రీ పాస్ కాని వారు మూడేళ్ళ లా విద్యను అభ్యసించే అవకాశం లేదు. కానీ తమ్మినేని సీతారాంకు ఎలా సాధ్యమైందో ఆయనే చెప్పాలి. అంటే ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తో లా కాలేజ్ లో ప్రవేశం పొందారా..? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం ఏపీ టీడీపీ నేతలకు అస్త్రంగా మారనుంది.
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా… అర్హత లేకుండానే తమ్మినేని సీతారం లా కోర్స్ లో జాయిన్ అయ్యాడనే విషయంతో ఏపీలో రాజకీయ రచ్చకు వేదిక కానుంది.