టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అచ్చం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన వ్యాపం కుంభకోణం తరహాలోనే ఉంది. వ్యాపం అనేది మధ్యప్రదేశ్ లో వ్యావసాయిక్ పరీక్షా మండల్ అనే పేరుగల వృత్తి విద్యా కోర్సుల పరీక్ష నిర్వహణ బోర్డు. ఈ సంస్థ మధ్యప్రదేశ్ లో నిర్వహించిన పరీక్షల్లో భారీగా అవకతవకలు జరగగా…టీఎస్ పీస్సీ తెలంగాణలో నిర్వహించిన పరీక్షల్లోనూ అదే తంతు కొనసాగినట్లు ఇటీవల వెల్లడి అయింది. అక్కడ రాజకీయ నాయకులు , ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ వ్యవహారంలో సంబంధముండగా… తెలంగాణ విషయానికి వస్తే ఈ పేపర్ లీక్ తో రాజకీయ నాయకులకు, టీఎస్ పీస్సీ ఉద్యోగులకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
అనర్హులైనవారు మధ్యవర్తుల ద్వారా రాజకీయ నాయకులకు, వ్యాపం ఉద్యోగులకు లంచమిచ్చి పెద్ద ర్యాంకులు తెచ్చుకోవడం మధ్యప్రదేశ్ లో 90వ దశకంలో బయటపడింది. వ్యాపం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు కేసులు నమోదు అయ్యాయి. 2000వ సంవత్సరంలో మొదటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మళ్ళీ ఆ తరువాత 2009లో పెద్ద స్థాయిలో ప్రిమెడికల్ టెస్టుకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణ జరిపింది. 2011లో ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా వందకు పైగా నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టడంతో ఈ కేసులో ఎందరో రాజకీయ నాయకులు, ప్రభుత్వద్యోగులు, వ్యాపం ఉద్యోగులు, మధ్యవర్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు బయటకు వచ్చాయి. జూన్ 2015 నాటికి 2000 మందికి పైగా అరెస్టయ్యారు. వీరిలో రాష్ట్ర మాజీ విద్య మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఇంకా వంద మందికి పైగా రాజకీయ నాయకులు ఉన్నారు.
ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్ తన విశేశాదికారాలను వినియోగించారు. ఇద్దరు మంత్రులకు సంబంధించి ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. కానీ గవర్నర్ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ క్యాబినెట్ తిరస్కరించింది. అప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ మధ్యప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ నిర్ణయం సరైనదేనని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. గవర్నర్ నిర్ణయాన్ని క్యాబినెట్ తిరస్కరిస్తే వ్యవస్థ అంత కుప్పకూలుతుంది. కాబట్టి ఆ మంత్రులను ఆ ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తీర్పుని ఇచ్చింది.
ఇప్పుడు ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు వ్యాపం కుంభకోణంలో ఎలాంటి తీర్పునిచ్చిందో ఆ తీర్పును ప్రస్తావిస్తూ కేటీఆర్ ను , టీఎస్ పీస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, అనితా రాంచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్ గవర్నర్ ను కోరారు. టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం వ్యాపం కుంభకోణంకు దగ్గరగా ఉందని…ఈ వ్యవహరంలో మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. టీఎస్ పీస్సీలో జరిగిన అవకతవకలకు ఐటీ శాఖదే బాధ్యత కాబటి. ఆ శాఖమంత్రిగా ఉన్న కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేలా రాజ్యాంగంలో 317 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ కు విశేషాదికారాలు ఉన్నాయని తెలిపారు.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 317 ద్గవారా వర్నర్ విశేషాదికారాలు ఉన్నాయని అన్నారు. ఆ అధికారం ప్రకారం టీఎస్ పీస్సీలోని అధికారులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందని రేవంత్ గుర్తు చేశారు. సిట్ విచారణ చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అధికారులు విచారణ చేసే సమయంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ హోదాలో కొనసాగకూడదు. కాని సర్కార్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోపోగా కేటీఆర్ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా మాట్లాడారని రేవంత్ ఆరోపిస్తున్నారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ , కంప్యూటర్ ఎక్స్ పర్ట్ రాజశేఖర్ రెడ్డి ఈ ఇద్దరు మాత్రమే నేరానికి పాల్పడ్డారు. దీనీతో సంస్థకు గాని, వ్యవస్థకు గాని ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ ప్రకటించారంటే విచారణను ఎదుర్కోవాల్సిన చైర్మన్, సెక్రటరీ, అందర్నీ కాపాడే ప్రయత్నమేనని ఆరోపిస్తున్నారు రేవంత్. అందుకే గవర్నర్ ను రాజ్యాంగంలోని 317ఆర్టికల్ ప్రకారం మొత్తం విచారణ పూర్తయ్యే వరకు టీఎస్ పీస్సీని రద్దు చేయాలన్నారు. వ్యాపం కుంభకోణం తరహాలోనే టీఎస్ పీస్సీ కుంభకోణం అని.. దీనిపై నిష్పాక్షపాత విచారణ జరిగితే ప్రభుత్వ పెద్దలు కటకటాల్లోకి వెళ్ళాల్సి వస్తుందనే ఆందోళనతోనే సిట్టింగ్ జడ్జితో విచారణకు సర్కార్ జంకుతుందని ఆరోపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి అప్లికేషన్ ఇచ్చినట్లుగా మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అవకాశం ఇస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ప్రగతి భవన్- రాజ్ భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ ఘటనపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. అధికారులను నివేదిక కూడా కోరారు. ఇప్పుడు రేవంత్ అప్లికేషన్ ప్రకారం కేటీఆర్ విచారణను ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారే అవకాశం ఉంది.