ఈ సినిమా చూశాకా తలపోటు వచ్చిన ప్రేక్షకుడికి చాలా సందేహాలు కలుగుతాయి. అందులో ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకుడి కోసం కృష్ణ వంశీ తీశాడు అని. నాటక కళా కారుల కోసం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో రంగస్థల కళాకారులు ఎక్కడున్నారు? అసలు రంగస్థలం ఎక్కడ బతికుంది? కృష్ణ వంశీ చిన్నతనంలోనే నాటకరంగం కోన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. అతను ఎదిగాకా ఇప్పటివరకు అతను కనీసం పాతిక నాటకాలు చూసాడా? ఈ జనరేషన్ లో కనీసం 1 శాతం యువకులైనా నాటకాలు చూడలేదు. ఇప్పుడున్న జనాభాలో కనీసం 5 శాతం మంది నాటకాలు చూడలేదు. మరి అందరు మరిచిపోయిన రంగస్థలం గురించి చెప్పాలి అనుకోవడం కృష్ణ వంశీ అమాయకత్వం. ఇదే సినిమా 1960 లో వచ్చిఉంటే పెద్ద హిట్ అయ్యేది. కృష్ణ వంశీ ఇంకా ‘నెగిటివ్’ రీళ్లు వాడే సినిమాలోంచి బయటపడి డిజిటల్ చిప్ లు వాడే జనరేషలోకి రాలేదు అనిపిస్తుంది ఈ పాత కంపు సినిమా చూశాకా. సంసారం ఒక చదరంగం, కలికాలం లాంటి వందలాది సినిమాల కోవలో చేరింది ఈ సినిమా.
కథ ఏమిటి?
అసలు ఈ సినిమాలో కథ అనేది కొత్తగా ఏమి లేదు. పాత కథనే. కొన్ని వందల సినిమాలు, కొన్ని వేల టి వి సీరియల్ ఎపిసోడ్లల్లో చూసిన పాత చింతకాయ పచ్చడి కథ. ఆ కథ కూడా రంగస్థల కళాకారులది కావడంవలల నేటి జనానికి అర్థం కాదు. నిజానికి ఇది కృష్ణ వంశీ ఒరిజినల్ కథ కాదు. ఆయన ఈ కథ చెపితే ఎవ్వరూ తీయరు. ఇది దక్షిణాన హిట్ అయిన సినిమాకు రీమేక్. నానా పాటేకర్ నటించిన ఆ సినిమా హిట్ కావడానికి కారణం – దక్షిణ భారత దేశంలో రంగస్థలం ఇంకా ఓ వెలుగు వెలుగుతోంది. డబ్బులు పెట్టి టికెట్లు కొని నాటికలు చూసే ప్రేక్షకులు ఇంకా అక్కడ ఉన్నారు. నానా పాటేకర్ లాంటి హిందీ నటీనటులు ఇప్పటికి నాటకాలు వేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
కానీ మన దగ్గర నాటకరంగం నామరూపాలు లేకుండా పోయింది. కాబట్టి ఆ కథలోని ఏ ఒక్క సన్నివేశం కూడా మనకు కనెక్టు కాదు. నాటకరంగాన్ని ఏలిన ఓ మహా నటుడు జీవితంలో ఎలా ఫెయిల్ అయ్యాడో చెప్పడం ఈ కథ ప్రధాన ఉద్దేశం. అసలు దీనికి కూడా లాజిక్ లేదు. వృత్తి వేరు, ప్రవుత్తి వేరు. వృత్తిలో విజయం సాధించిన వాడు నిజజీవితంలో విజయం సాధించాలి అనే రూల్ ఎక్కడా లేదు. బ్యాంకు లో కోట్ల రూపాయలు లెక్కపెట్ట క్యాషియర్ నిజజీవితంలో కొట్టేశ్వరుడు కావాలనే రూల్ లేదుగా. బెల్ట్ షాపులో సారా అమ్మేవాడు ఇంటికి తాగానే తాగాలనే రూల్ లేదుగా? అలాగే నాటకరంగం మీద అన్ని పాత్రలు విజయవంతంగా పోషించిన నటుడు జీవితంలో ఎలా నటిస్తాడు? ఎందుకు నటిస్తాడు? వృత్తికి, నిజ జీవితానికి ఎందుకు ముడిపెట్టాలి? అతను నిజ జీవితంలో కూడా ఓ కల్పిత పాత్రలో నటిస్తూ దొరికి పొతే అప్పుడు నటుడిగా జీవితంలో ఓడిపోయాడు అనవచ్చు.
సాంకేతిక వర్గం ఏమిటి?
సినిమా హాలులోంచి జనాలు మధ్యలో పారిపోకుండా ఉండటానికి కారణం ప్రకాష్ రాజ్, బ్రహ్మమానందం, రమ్య కృష్ణ. ఈ ముగ్గురు తమ అద్భుత నటనతో ప్రతి సీన్ పండించడానికి తమ వంతు కృషి చేశారు. కెమెరా పనితీరు బాగుంది. ఇళయరాజా సంగీతం గొప్పగా ఉంది. కానీ దానికి అనుకూలంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు 1950 నాటి సాహిత్యాన్ని గుర్తుకు తెస్తాయి. పాటలలో ఎక్కడా కవిత్వం ధోరణి లేదు. గుండెను తాకే ఒక్క పదం లేదు. అసలు అతను ఎం చెప్పాలి అనుకున్నాడో ఒక్క ముక్క ఎక్కి చావదు. ఒక వ్యాసాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాటగా రాసినట్లు ఉన్నాయి. పొతే ఆకెళ్ళ శివ ప్రసాద్ రాసిన మాటలు చాలా బాగున్నాయి. పాత కథ, డొక్కు సన్నివేశాలకు ఆ మాటలు రాసిన, అవి బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. మందు ఎంత పవర్ఫుల్ అయ్యినా శవానికి ఇంజక్షన్ చేస్తే ఉపయోగం ఉండదు.
మైన పాయింట్లు
ఈ సినిమా నేపథ్యం రంగస్థలం కాకుండా కనీసం సినిమా నేపథ్యం తీసుకున్నా జనానికి పట్టేదేమో! చలం, రామ్మోహన్, హరనాథ్, రంగనాథ్ లాంటి వాళ్ళ కష్టాలు తెల్సిన ప్రేక్షకులు దీనిని ఆస్వాదించే అవకాశం ఉండేది. ఈ సినిమాకు దర్శకుడు కృష్ణ వంశీ, ఆయన రాసుకున్న పాత స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్ లు. చిన్న చిన్న విషయాలకు కూడా పాత్రలు కేకలు, పెడబొబ్బలు పెడుతుంటే చిరాకు కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా పండలేదు. కృష్ణ వంశీ ‘జబర్ దస్త్’ చూస్తే కామెడీ అంటే ఏమిటో తెలుస్తోంది. ఇంకా అతను ‘గులాబీ’ సినిమా కామెడీ నే నమ్ముకున్నాడు అనిపిస్తుంది. దాదాపు అన్ని సీన్లు బోర్ గా ఉన్నాయి. మంచి ఎడిటర్ చేతిలో ఈ సినిమా పడితే 60 శాతం ఎడిట్ చేసేవాడు.
రేటింగ్ ; 5 పాయింట్ లకు 1 పాయింట్.