ఇట్లా అవునని ఎవరనుకున్నారు..? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విలీనం అయ్యాక తెలంగాణ దగా పడుతున్న స్థితిని చూసి కాళోజి తన ఆవేదనను ఇలా వ్యక్తపరిచాడు. నాడు తెలంగాణ ఏపీలో విలీనం కావడంపై అయన ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేసి ఉన్నారో… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా నాడు ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాసంగికత ఏర్పడి ఉన్నది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పౌరుల హక్కులను పాలకులు నిసిగ్గుగా అణచివేస్తుంటే… కాళోజి మాటలు గుర్తుకు రాకుండా ఎలా ఉంటాయి..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇలా జరుగునని ఎవరనుకున్నారని ఆవేదన చెందకుండా ఎలా ఉంటాం.?
ఉద్యమకారుడే పాలనాధిపతి అయ్యాడని తెలిసి సంతోషించినం. నక్సలైట్ ఎజెండా మాదని మాట్లాడితే..హక్కుల అణచివేతలు ఉండవని సంబురపడినం. ప్రజాస్వామ్య పరిరక్షణలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని విశ్వసించినం. కానీ నమ్మిన వ్యక్తే తెలంగాణ ప్రజలను తడి గుడ్డతో గొంతు కోస్తున్నాడు. ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా విస్మరించాడు. నీళ్ళు, నిధులు, నియామకాలు ఏమైయ్యాయని ప్రశ్నిస్తే… ప్రశ్నించిన గొంతుకలు అదృశ్యం అవుతున్నాయి. ప్రశ్నపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. దొరగారి భజన కీర్తలను మాత్రమే ఆహ్వానిస్తున్నది. ప్రశ్నను మాత్రం సహించలేకపోతున్నది. అందులో భాగమే తీన్మార్ మల్లన్న అరెస్ట్.
మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు. ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులకు కూడా కనీసం సమాచారం లేదు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరు పరిచి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేయాలని మౌలిక నిబంధనను రాజ్యం విస్మరిస్తోంది. రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతోంది. నిజానికి మల్లన్న ఏం చేసినట్లు… నేరం చేశాడా..? ఎవరినైనా బెదిరించాడా..?ఏదీ లేదు.
Also Read : తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి – తెర వెనక ఉన్నది ఆ మంత్రేనా…?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ , పేపర్ లీకేజీలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై విశ్లేషణ చేయడం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు నచ్చలేదు. పేపర్ లీకేజీలో సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడం యాక్టింగ్ సీఎం కేటీఆర్ కు నచ్చలేదు. తెలంగాణలో పాలక పక్షానికి భజన చేస్తే నజరానా ఇస్తారు. కాని మల్లన్న ఆ పని చేయడం లేదు. ప్రజల తరుఫున, ప్రజల కోసం పాలక పక్షాన్ని నిలదీస్తున్నాడు కదా. అందుకే సర్కార్ కు కోపమొచ్చింది. ఇంకేముంది తీసుకెళ్ళి బొక్కలో వేశారు. తెలంగాణ ప్రజల తరుఫున మాట్లాడటం ప్రశ్నించడం రాజ్యద్రోహం. కల్వకుంట్ల కుటుంబానికి భజన చేయడమే కర్తవ్యంగా ఉండాలట. కోట్లాది మంది సాధించుకున్న రాష్ట్రంలో ప్రశ్నకు సంకెళ్ళు వేసే ప్రయత్నం జరుగుతోంది. బుద్దిజీవులారా ఇకనైనా తెలంగాణలో అడుగంటిపోతున్న హక్కుల గురించి మాట్లాడండి. లేదంటే రేపు మిమ్మల్నీ బంధీ చేయవచ్చు..
Also Read : Big Breaking : తీన్మార్ మల్లన్న అరెస్ట్.. ఎందుకంటే..?