క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలోనీ క్యూ ఛానెల్ లోకి టాస్క్ ఫోర్స్ పోలీసులు చొరబడి మల్లన్నను ఎత్తుకెళ్లారు. అయితే, మల్లన్నను ఏ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు..? ఎందుకు, ఏకేసులో అరెస్ట్ చేశారనే విషయాలను పోలీసులు తెలియజేయలేదు. లిక్కర్ స్కాం…పేపర్ లీకేజీ ఇష్యూలపై కల్వకుంట్ల ఫ్యామిలీకి వ్యతిరేకంగా మల్లన్న వార్త వ్యాఖ్యానాలు చేస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. బీఆర్ఎస్ పెద్దలు కూడా మల్లన్న కథనాలపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి ఉండొచ్చునని చెబుతున్నారు.
మొన్నే క్యూ న్యూస్ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.ముఖాలకు మాస్క్ లు ధరించి ఆఫీసులోకి చొరబడి నానా భీభత్సం సృష్టించారు.మంత్రి మల్లారెడ్డి అనుచరులే కేటీఆర్ సూచన మేరకు క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేశారని మల్లన్న ఆరోపించారు. ఈ విషయమై మల్లన్న పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మల్లన్న ఆఫీసుపై దాడి చేసిన వారెవరో గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంటే దీని వెనక సర్కార్ పెద్దల హస్తం ఉందని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగినా…ఉద్యోగులపై దాడి జరిగినా మల్లన్న టోన్ లో ఎలాంటి చేంజ్ లేదు. పైగా మరింత అగ్రెసివ్ గా బీఆర్ఎస్ పై మాటల తూటాలు వదులుతున్నారు. దీంతో సర్కార్ కు కోపం వచ్చినట్లుంది.అందుకే తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మల్లన్నతోపాటు మార్నింగ్ న్యూస్ లో కనిపించే సుదర్శన్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరుసగా క్యూ న్యూస్ ఆఫీసు పై దాడి…మల్లన్న అరెస్ట్ చూస్తుంటే కుట్ర కోణం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లిక్కర్ స్కాం…పేపర్ లీకేజీ ఇష్యూ ముగిసే వరకు మల్లన్న లాంటి వాళ్ళను అరెస్ట్ చేయాలని సర్కార్ కక్ష గట్టిందని క్యూ న్యూస్ సిబ్బంది ఆరోపిస్తోంది.