వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. రచ్చబండ పేరుతో నిత్యం మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ ను కడిగి పారేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలోనూ లోపాలను ఎత్తిచూపుతూ వైసీపీకి పంటికింది రాయిలా మారారు. దీంతో రఘురామను అణగదొక్కాలని ఆ మధ్య రాజ్యద్రోహం నేరం మోపి జైలుపాలు చేసింది. సీఐడీ విచారణలో తనను అధికారులు కొట్టారని జగన్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
నరసాపురం ఎంపీ రఘురామ వైసీపీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. మళ్ళీ ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఆయన మాత్రం మరోసారి పోటీ చేయాలనుకుంటున్నారు. అది వైసీపీ నుంచి కాదు. టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తనను తీవ్రంగా హింసించిన వైసీపీని ఓడించి సత్తా చాటాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేలా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన – టీడీపీలు పొత్తులతో వెళ్ళే అవకాశం ఉంది. అదే జరిగితే నరసాపురం నుంచి రఘురామకు అవకాశం ఇస్తారా…? అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పొత్తులతో వెళ్తే నాగబాబు విజయం సాధించడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీగానున్న రఘురామ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేస్తే రఘురామ భీమవరం లేదా నరసాపురం అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసే అవకాశం ఉంది. నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూడా జనసేన నుంచి బలమైన అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ ఉన్నారు. పొత్తులో భాగంగా నరసాపురం అసెంబ్లీ స్థానం కూడా జనసేనకు దక్కితే రఘురామ భీమవరం నుంచి పోటీ చేయవచ్చు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే రఘురామ అసెంబ్లీ పార్లమెంటు దేనికి పోటీ చేసినా సులువుగా గెలుస్తారని చెబుతున్నారు. మరి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదంటే పార్లమెంటుకు పోటీ చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
Also Read : ఎన్నికల మూడ్ లోకి చంద్రబాబు – వంద స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారా..?