ఉన్నట్టు ఉండి ఈ రోజు నిమ్స్ లోని నర్సులు సమ్మె బాట పట్టారు. అన్ని వార్డ్ లలో రోగులకు సేవలు నిలిచిపోయాయి. ఇన్ పేషేంట్, అవుట్ పేషేంట్ లు నానాఅవస్థలు పడుతున్నారు. ఈ రోజు జరగవలసిన ఆపరేషాలు ఆగిపోయాయి. నర్స్ లు లేక కొన్ని విభాగాలను యాజమాన్యం ఈ రోజు ఉదయం నుంచి మూసేసినట్లు తెలిసింది. డాక్టర్ లు సమ్మె చేస్తే వచ్చే నష్టం కంటే నర్సులు సమ్మె చేస్తేను నష్టం ఎక్కువగా ఉంటుంది.
నర్సుల డిమాండ్లు ఈ రోజు కొత్తగా తెరమీదికి వచ్చినవి కావు. కొన్నేళ్ళ తరబడిగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు మొదటిసారి చేసిన సమ్మె కూడా కాదు. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మెరుపు సమ్మెలు చేస్తూనే ఉన్నారు. సమ్మె చేసిన ప్రతిసారి ఉన్నత అధికారులు లేదా మంత్రులు రావడం, వాళ్ళ డిమాండ్లు తప్పక నేరవేరుస్తాము అని హామీ ఇవ్వడం, దానితో చల్లబడిన నర్స్ లు సమ్మెను విరమించడం పరిపాటిగా మారింది.
కానీ ఎప్పటిలా కాకుండా ఈ రోజునుంచి ఈ సమ్మెను నిరవదిక సమ్మెలా మార్చాలని నర్స్ లు ఈసారి గట్టిగానే నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లను నేరవేరుస్తాము అని యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చి, వాటిని అమలు చేసేవరకు సమ్మె విరమించమని గట్టిగానే వాదిస్తున్నారు.
అయితే నిమ్స్ లోని నర్స్ లు టెంట్ వేసి, ఎర్ర జెండాలు పట్టుకుని, హోరెత్తే నినాదాలతో సమ్మె చేయడం లేదు. నర్సలు డ్యూటీ ఎక్కి, పని చేయకుండా వార్డుల ముందు కూర్చుని తమ నిరసన తెలియజేస్తూన్నారు. ఇది కొత్తరకం సమ్మె. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో, రోగులు ఎన్ని రోజులు నరకం అనుభవించాలో యాజమాన్యానికే తెలియాలి.