వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో అవినాష్ రెడ్డిని పలు దఫాలుగా విచారించిన సీబీఐ భాస్కర్ రెడ్డిని ఓసారి విచారించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించింది. త్వరలోనే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో..దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా తమను ఈ కేసులో ఇరికించడం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐ డైరక్షన్ లోనే దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సీబీఐ ఒత్తిడితోనే ఇది జరిగి ఉంటుందన్నారు. వివేకా హత్యతో తమకెలాంటి సంబంధం లేదని…ఈ హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు చేశారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు.
వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరేనని పిటిషన్ లో పేర్కొన్నారు భాస్కర్ రెడ్డి. దస్తగిరి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని తన పిటిషన్ లో ప్రస్తావించారు. దీంతో వివేకా మర్డర్ మరో మలుపు తిరిగింది.
Also Read : వైసీపీ నేతలపైనే దాడి జరిగితే వీడియోలు బయటపెట్టరా..?