–అసెంబ్లీలో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు
–టీడీపీ సభ్యులపై దాడి
వైసీపీ ఎమెల్యేలు రెచ్చిపోయారు. టీడీపీ ఎమెల్యేలపై దాడికి పాల్పడ్డారు. ఇందుకోసం ఏకంగా అసెంబ్లీనే యుద్దక్షేత్రంగా మార్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై గొంతు వినిపించాల్సిన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యులపై దాడికి పాల్పడి వైసీపీ ఎమ్మెల్యేలు సభ్య సమాజాన్ని నివ్వెరపరిచారు.
సభకు రండి మీ అంతు చూస్తామని గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యేలు అన్నంతపని చేశారు. జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేస్తుంటే వారిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఎవరిపై దాడి చేయాలో ముందే ఫిక్స్ చేసుకున్నట్లుగా టార్గెటెడ్ గా దాడికి పాల్పడినట్లు విజువల్స్ చూస్తె అర్థం అవుతోంది. టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేశారు. సుధాకర్ బాబు దాడి చేయడంతో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను ఒక్కసారిగా నిలిపివేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలను పచ్చిబూతులతో తిడుతూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేయడంతో టీడీపీ నేతలు అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎవరిని కంట్రోల్ చేయాలో తెలియక స్పీకర్ హడావిడిగా సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మళ్ళీ పక్షపాతం ప్రదర్శిస్తు స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. స్పీకర్ వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సమక్షంలోనే తమపై దాడి జరిగినా తమనే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
టీడీపీ ఎమ్మెల్యేలపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి చేశారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను అసెంబ్లీలోకి కూడా ప్రవేశపెట్టారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యులపై అసెంబ్లీ సాక్షిగా దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు. చట్టసభల్లో ఎమ్మెల్యేలపై కూడా దాడి చేసే పరిస్థితి వచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే.. స్పీకర్ పై టీడీపీ సభ్యులు దాడి చేసేందుకు యత్నించడంతో వారిని అడ్డుకున్నామని వైసీపీ సభ్యులు చెబుతున్నారు. ఇదే జరిగితే అసెంబ్లీ లైవ్ ను ఎందుకు ఆపారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే మౌనం వహిస్తున్నారు.
Also Read : కుప్పం కొడుదామనుకుంటే పులివెందులలో ఇలా జరిగిందేంటి..?