ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ కవిత అనేక మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. న్యాయనిపుణుల సూచన మేరకు రెండోసారి విచారణ నుంచి తప్పించుకున్న కవితకు మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాల్సిందేనని నోటిసులో పేర్కొంది. ఈ క్రమంలోనే కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శుక్రవారం అత్యవసర పిటిషన్ ను కవిత దాఖలు చేశారు.
ఈ అత్యవసర పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిందని.. ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఆ నోటిసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కవిత ఇప్పటికే ఓసారి విచారణకు హాజరయ్యారని…ఆమె అంగీకారం లేకుండానే విచారణ సందర్భంగా ఫోన్ సీజ్ చేశారని.. నిబంధనలకు విరుద్దంగా విచారణ జరిగిందని వాదించారు. దీంతో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఇప్పటికే ఈ విషయమై పిటిషన్ దాఖలు చేశారు కదా..24న ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని చెప్పాం కదా అని అసహనం వ్యక్తం చేసింది. అయితే.. 24న ఈ పటిషన్ పై సుప్రీంకోర్టులో హియరింగ్ ఉన్నందున్న… 20న ఈడీ విచారణను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేయడంతో కవిత ఈ నెల 20న ఈడీ విచారణకు వెళ్తారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 20న ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయనే విషయాలపై న్యాయనిపుణులతో కవిత చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు కవిత ఇంతగా ప్రయత్నిస్తున్నారంటే…అరెస్ట్ చేస్తారని సమాచారంతోనే కవిత విచారణకు జంకుతున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీలోనూ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం..?
కాగ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు హాజరుకాలేనని ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించారని.. అందుకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలిందంటూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. దీనిపై కవిత స్పష్టతనిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కోర్టులో తాను గతంలోనే పిటిషన్ వేశానని తెలిపారు. ఈనెల 24 ఆ పిటిషన్‌ను విచారిస్తామని చెప్పి సుప్రీం కోర్టు తెలిపిందన్నారు. తాజాగా ఈరోజు తాను ఏ విధమైన పిటిషన్‌ను దాఖలు చేయలేదంటూ కవిత ట్వీట్ చేశారు.