బీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ కూడా నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు ఆది నుంచి అన్యాయమే జరుగుతుందని… మహిళలకు అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ఏమి తక్కువ తినలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత. బీఆర్ఎస్ కూడా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించనందువల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తాను పోరాటం చేస్తున్నట్లు తెలిపారు కవిత.
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కవిత ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ మొదటి దఫా పాలనలో మహిళలకు మంత్రివర్గంలో కేసీఆర్ అవకాశమే కల్పించలేదు. ఇది బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలకు కారణమైంది. దాంతో రెండో దఫా పాలనలో మాత్రం ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో కేసీఆర్ చోటిచ్చారు. పైగా…2014తో పోలిస్తే 2018లో మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది తక్కువ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించాక ఈ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ వద్ద కాదు.. ప్రగతి భవన్ ముందు ఆందోళన చేయాలని కవితకు హితవు పలికారు. ఈ క్రమంలోనే ఆమె బీఆర్ఎస్ కూడా మహిళలకు పెద్దగా అవకాశాలేమి కల్పించలేదని చెప్పడం విశేషం.
Also Read : ఎమ్మెల్సి కవిత అరెస్ట్ కు ఈరోజు రంగం సిద్ధమైనట్లేనా?