వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై నేటికి నాలుగేళ్ళు. వివేకా చనిపోయినప్పుడు గుండెపోటని ప్రచారం చేసినప్పటికీ… ఈ విషయమై తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ విచారణ జరపాలని నాడు ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేశారు. చిన్నాన్న వివేకా మరణం బాధాకరమని జగన్ , అవినాష్ రెడ్డిలు కన్నీరు కూడా పెట్టుకున్నారు. టీడీపీ నేతలపై ఈ హత్యనేరాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకున్నారు. కట్ చేస్తే ఎన్నికల్లో గెలిచాక సీబీఐ విచారణ వద్దని జగన్ వాదించారు. సిట్ విచారణ చేస్తుందని అన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిగేలా న్యాయస్థానాల్లో వివేకా కూతురు పోరాడారు.
ఇకపోతే.. వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా అబ్బాయిలెవరూ నివాళులు ఆర్పించలేదు. ఆయన హత్యకు గురైన రోజున వెక్కి ,వెక్కి ఏడ్చిన అబ్బాయిలు వివేకా వర్ధంతి రోజున మాత్రం నివాళి ఆర్పించి ఆయనను స్మరించుకునేందుకు ఆసక్తి చూపలేదు. అటు జగన్ కాని, ఇటు అవినాష్ రెడ్డి కాని బాబాయ్ వివేకా వర్ధంతిని పట్టించుకోలేదు. వివేకా కూతురే పులివెందులలో తండ్రి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించింది. సునీత వెంట వైఎస్ కుటుంబ సభ్యుల్లో కొంతమంది మాత్రమే ఉన్నారు.
వివేకా సోదరుడు ఆయన అనుచరులు సునీత వెంట ఉన్నారు. మరికొంతమంది సునీతకు సంఘీభావం చెప్పినా… మరికొంతమంది అవినాష్ రెడ్డికి కోపం వస్తుందని మౌనంగానే ఉండిపోయారు. వివేకా హత్యపై విచారణ చేపట్టిన అధికారులు.. రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కామన్ అని అన్నారని సునీత గుర్తు చేశారు. కానీ తన తండ్రిని హత్య చేసిందెవరో తేలాలని ఇంతలా పోరాడుతున్నట్లు ఆమె చెప్పింది. బంధువుల మీద ఆరోపణలు చేస్తున్నానని తెలుసు కానీ… బంధువులు ఇలా దారుణాలకు పాల్పడుతారా.? అనేది తేలాలనేది తన అభిమతమని ఆమె స్పష్టం చేశారు.
వివేకా హత్య కేసును అటు, ఇటు పోయి ఆయన అల్లుడిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వివేకాకు రెండో పెళ్లి జరిగిందని.. ఆస్తుల పంపకంలో విబేధాలు రావడంతో ఆయన అల్లుడే ఈ హత్య చేసి ఉండొచ్చుననే విధంగా అవినాష్ రెడ్డి ఆరోపించారు. దీంతో అవినాష్ రెడ్డి వర్గం వివేకా అల్లుడు , బిడ్డలను బంధువులుగా కూడా చూడటం లేదు. అందుకే సునీత పాలుపంచుకునే ఏ కార్యక్రమానికి తాము హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : జనసేనకు బిగ్ షాక్ – టీడీపీలోకి నాదెండ్ల మనోహర్..?