బీజేపీలో నెలకొన్న వర్గ విబేధాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారా..? బండి సంజయ్ వర్గీయులంతా ధర్మపురి అరవింద్ ను కార్నర్ చేస్తుండటంతో ” ధర్మపురి అరవింద్ ” అనే సీక్రెట్ ఆపరేషన్ ను బీఆర్ఎస్ స్టార్ చేసిందా..? ఇందుకోసం వ్యాపార సంబంధాల ద్వారా అరవింద్ తో టచ్ లోకి వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ లో చేరికలపై కేటీఆర్ దృష్టి సారించారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని చావు దెబ్బ కొట్టాలని కేటీఆర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పలువురు బీజేపీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని కమలం క్యాంప్ కు షాక్ ఇచ్చారు. ఈ మధ్యే బీజేపీకి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇస్తామని కేసీఆర్ , కేటీఆర్ లు ప్రకటించారు. ఇప్పుడు అందుకు సరైన సమయం వచ్చిందని కేటీఆర్ భావించినట్టున్నారు. అందుకే ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కారెక్కించేందుకు తెరవెనక కేటీఆర్ పావులు కదుపుతున్నారట.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి అరవింద్ ను బీఆర్ఎస్ లోకి తీసుకొస్తే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు తిరుగే ఉండదని కేటీఆర్… బీజేపీ ఎంపీకి గాలం వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అరవింద్ ను బీఆర్ఎస్ లోకి తీసుకొస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు… నిజామాబాద్ లో పార్టీ మరింత స్ట్రాంగ్ కావడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలహీనపడటం ఖాయమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుందట. ఈ క్రమంలోనే కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను అరవింద్ ఖండించడంతో…అరవింద్ తో పార్టీలో చేరిక అంశంపై మాట్లాడేందుకు ఇదే మంచి సమయమని కేటీఆర్ భావిస్తున్నారట. అరవింద్ వ్యాపార సంబంధాల ద్వారా తనను బీఆర్ఎస్ లో చేర్చుకోవచ్చా..?అనే కోణంలో కేటీఆర్ ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అరవింద్ ను పార్టీలో చేర్చుకునే బాధ్యతను కేటీఆర్ తనకు అత్యంత నమ్మకస్తులైన నేతల ద్వారా జరుపుతున్నట్లు సమాచారం.
మరి.. కేటీఆర్ ఆఫర్ కు అరవింద్ ఒకే చెబుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ చేసిన ఆఫర్ కు అరవింద్ ఒకే చెప్పినా ఇప్పట్లో ఆయన పార్టీలో చేరబోరని… లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చాకే ఆయన చేరిక ఉండనుందని అంటున్నారు. ఎందుకంటే… లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ కు ఉచ్చు బిగించాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే… తమ పార్టీ ఎంపీని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారా.? అని బీజేపీ ఆలోచిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్ అంచనా వేస్తుందట.అందుకే సంప్రదింపుల ప్రక్రియను ఇప్పుడు పూర్తి చేసి బీఆర్ఎస్ లో అరవింద్ చేరికను తరువాత ఫిక్స్ చేద్దామని భావిస్తున్నారట.
Also Read : బండి సంజయ్ ఓ బ్లాక్ మెయిలర్ – బండారం బయటపెట్టిన బీజేపీ నేత