క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా అద్యక్షుడి తీరునే తప్పుబడుతున్నారు. కవితనుద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతారా..? సామెత అయితే ఆ వాక్యాన్ని ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. వెంటనే బండి సంజయ్ అనుకూలురు కూడా రంగంలోకి దిగడంతో పార్టీలోనున్న లుకలుకలను బయటపెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకుండా…ఈడీ అధికారులు ముద్దు పెట్టుకుంటారా..?అని కవిత ఈడీ విచారణకు మునుపే బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఇదేమంత పెద్ద బూతు కాదు. కానీ కవిత ఈడీ విచారణకు వెళ్ళిన రోజున ఈ వీడియోను బయట తీసుకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేశారు. మహిళలంటే బండి సంజయ్ కు ఇసుమంత గౌరవం లేదని దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటిసులు కూడా జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
బీఆర్ఎస్ నేతల ఆందోళనలు కొనసాగుతుండగానే బండికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కవితపై బండి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్ధనీయంగా లేవన్నారు. అంతేకాదు.. బండి సంజుయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం విశేషం. రాష్ట్ర అద్యక్షుడు మాట్లాడిన మాటలు పార్టీకి సంబంధం లేవనడం బండి సంజయ్ మద్దతుదారులకు ఏమాత్రం నచ్చడం లేదు. వెంటనే కవితపై బండి సంజుయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతల వర్షన్ వినిపించారు అరవింద్. గతంలో బండి సంజయ్ కు ప్రధాన మద్దతుదారునిగానున్న అరవింద్ రానురాను ఆయనకు దూరమయ్యారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గుడ్డిగా సమర్ధించే అరవింద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విషయంలో మాత్రం బండికి వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. కల్వకుంట్ల కుటుంబంపై ఒంటికాలి మీద లేచే అరవింద్ తన రాజకీయ ప్రత్యర్ధి కవితకు మద్దతుగా మాట్లాడటంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ రెండుగా చీలింది. అరవింద్ కు మద్దతునిచ్చేవారు… బండికి మద్దతునిచ్చేవారుగా విడిపోయి రచ్చకెక్కారు. అరవింద్ కు మద్దతుగా సీనియర్ నేత పేరాల శేఖర్ రావు నిలవగా.. బండికి సపోర్ట్ గా రాజసింగ్ , విజయశాంతిలు రంగంలోకి దిగారు. బండిపై అరవింద్ వ్యాఖ్యలు సరికాదంటూ రాజా సింగ్ హితవు పలికారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడని.. ఏది మాట్లాడాలి.. ఏది మాట్లాడకూడదనే అవగాహన అతనికి ఉందన్నారు. పార్టీలో ఏమైనా ఇబ్బంది ఉంటే నేరుగా అధ్యక్షుడితో మాట్లాడి ఉండాల్సిందని, మీడియా ముందుకు రావడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా బండి సంజయ్‌పై అరవింద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడాలని.. ఇలా బహిరంగంగా స్పందించడం సరికాదన్నారు.
మొత్తంగా బీజేపీలో వర్గాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : బండి సంజయ్ ఓ బ్లాక్ మెయిలర్ – బండారం బయటపెట్టిన బీజేపీ నేత