ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారా..? కవితను ఈ కేసు నుంచి బయట పడేయండని కేంద్ర పెద్దలతో కేసీఆర్ కాళ్ళబేరానికి దిగుతున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటిసులు ఇచ్చింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై నుంచి సేకరించిన సమాచారంతో కవితను విచారణకు పిలుస్తుండటంతో.. ఆమెను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు నష్టం తప్పదు. ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..లిక్కర్ స్కామ్ లో కూతురు అరెస్ట్ అయితే అది పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం మంచిది కాదు. పార్టీపై జాతీయంగా చెడు అభిప్రాయం నెలకొనే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటిని అంచనా వేసిన కేసీఆర్ కేంద్రం పెద్దలతో రాయబారానికి ఆసక్తిచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సమయంలో ప్రధానిమోడీని నేరుగా కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి..మోడీ అండ్ షా లతో ఫోన్లతో మాట్లాడేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
లిక్కర్ స్కాంలో కవితను కాపాడుకునేందుకుగాను గతంలో కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోరారన్న వాదనలు ఉన్నాయి. గత అక్టోబరు 11న యూపీ సమాజ్‌వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలకు కేసీఆర్ హాజరై అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు. హస్తిన వెళ్ళినా కేసీఆర్ వారం రోజులు అక్కడే మకాం వేశారు. బీఆర్ఎస్ విస్తరణ కోసమే ఆయన ఢిల్లీలో ఉంటున్నారని వార్తలు వెలువడినా.. లిక్కర్ స్కాం విషయంలో ప్రధానిని కలిసేందుకోసమే అక్కడ వారం రోజులపాటు ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. రాజకీయంగా మోడీ, షా ల ద్వయం పగబడితే ఎలా ఉంటుందో కేసీఆర్ కు తెలియనిది కాదు. మోడీపై కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయడంతో సహించని ప్రధాని ఆయనను దూరం పెట్టారు. అందుకే అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకోవడం… కవిత సన్నిహితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఈడీ కవితకు తాజాగా నోటిసులు ఇవ్వడంతో కేసీఆర్ లో కలవరం మొదలైంది. దీంతో కేసీఆర్ కేంద్ర పెద్దలతో తనకున్న పరిచయాల ద్వారా ప్రధానితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.