గురువారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన ప్రగతి భవన్ లో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
మూడు లక్షల ఆర్ధిక సాయంపై గైడ్ లైన్స్
ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా సొంత జాగ ఉన్నోళ్ళకు మూడు లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సొంత జాగ ఉన్నోళ్ళకు మూడు లక్షల సాయం అందించడంపై గైడ్ లైన్స్ ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎవరికీ ఈ మూడు లక్షల సాయం అందించాలి..? ఎలాంటి పరిమితులు విధించాలి..? దశల వారీగా ఒకేసారి ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తే ఎలా ఉంటుంది..? విడతల వారీగా విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై చర్చించి.. విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో అర్హులను గుర్తించి వచ్చే నెల నుంచి ఈ ఆర్ధిక సాయాన్ని అర్హులకు అందించాలని సర్కార్ భావిస్తోంది. ఎన్నికలకు మరెంతో సమయం లేనందున్న ఇక ఈ విషయంలో మరింత నాన్చివేత అవలంభిస్తే ఇబ్బంది అవుతుందని..వచ్చే నెల నుంచి సాయాన్ని అర్హుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తోంది.
ఇళ్ళ పట్టాల పంపిణీ
ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపైనా కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ఈ మంత్రివర్గ సమావేశంలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, తుమ్మల లేదా బూడిద భిక్షమయ్య గౌడ్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రగతి భవన్ వర్గాల సమాచారం. గతంలో గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేస్తే ఆ ఫైల్ కు ఆమోదం తెలపకుండా గవర్నర్ పెండింగ్ లో ఉంచడంతో..ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ ఎన్నికలైనా అభ్యర్థులను ఏకపక్షంగా ఎంపిక చేసే కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కేబినెట్‌లో చర్చించి ఎంపిక చేయనుండటం విశేషం.
కవితకు ఈడీ నోటిసులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటిసులు ఇవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ.. కవితను అరెస్ట్ చేసేందుకే విచారణకు హాజరు కావాలంటూ నోటిసులు జారీ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.దీంతో కవిత ఇష్యూపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అనే విషయంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
పెండింగ్ బిల్లులపై..
గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లుల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో తీర్పు ఎలా ఉంటుంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అనే విషయాలు కూడా చర్చిస్తారని తెలుస్తోంది.