ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. నవీన్ కుమార్ , సీఎం ఒఎస్డీగా పని చేస్తోన్న గాయకుడు దేశపతి శ్రీనివాస్ ,ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తుమ్మలకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ ప్రొ మీడియా కూడా రెండు రోజులుగా హడావిడి చేసింది. కానీ కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
మార్చి 29న అలిమినేటి కృష్ణారెడ్డి, వూల్లోళ్ల గంగాధర్ గౌడ్, కురుమయ్య గారి నవీన్ కుమార్ లు పదవీ విరమణ చేయడంతో వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తుమ్మల, నవీన్ కుమార్ , చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. తుమ్మలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వడంతోనే ఆయన పొంగులేటితో కలిసి పార్టీ మరెందుకు వెనకడుగు వేశారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. ఖమ్మంలో బలమైన నేతగా ముద్రపడిన తుమ్మల పార్టీనుంచి చేజారితే బీఆర్ఎస్ కు అక్కడ తిప్పలు తప్పవని కేసీఆర్ తెలుసు.
వీటన్నింటిని అంచనా వేసుకొని తుమ్మలను పార్టీ మారకుండా చేసేందుకు హరీష్ రావును రంగంలోకి దించారు కేసీఆర్. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హరీష్ రావును ఇంచార్జ్ గా నియమించడంతో ఈ సభ నేపథ్యంలో జిల్లాకు చెందిన తుమ్మలతో భేటీ అయి..ఆయన అసంతృప్తికి కారణాలు అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. పార్టీ మారవద్దని..బీఆర్ఎస్ లో సముచిత ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సి స్థానాల్లో మీకు తప్పకుండా అవకాశం ఉంటుందని తుమ్మలకు కేసీఆర్ మాటగా హరీష్ చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా మంగళవారం ఉదయం నుంచి తుమ్మల నివాసం వద్ద హడావిడి చేశారు. ఎమ్మెల్సీ పదవి ఖాయమనుకొని శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళారు. మెయిన్ స్ట్రీం బీఆర్ఎస్ అనుకూల మీడియాలో కూడా తుమ్మలకు ఎమ్మెల్సీ అంటూ కథనాలు ప్రసారం చేశారు.
ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కాని కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరును తప్పించారు. మధ్యాహ్నం వరకు ఆయన పేరు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఉందని ప్రచారం జరిగినా చివరి క్షణంలో ఆయన స్థానంలో మరో పేరు వచ్చి చేరడం వెనక ఏం జరిగి ఉంటుందని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. తుమ్మల రాజకీయంపై కేసీఆర్ కు నమ్మకం కుదరకే ఆయన పేరును తప్పించారా..? లేక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారా..? వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ విషయంలో హామీ ఇచ్చి తుమ్మలను సటిస్ఫై చేశారా..? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
కారణం ఏదైనప్పటికీ..ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు మిస్ కావడం ఖమ్మం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.