బీజేపీపై యుద్ధం చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను జాతీయ స్థాయిలో ఎవరూ విశ్వసించడం లేదు. ఎనిమిదేళ్ళు బీజేపీతో అంటకాగి.. బీజేపీ తీసుకొచ్చిన పలు కీలక బిల్లులకు మద్దతు తెలిపిన కేసీఆర్ అనూహ్యంగా బీజేపీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. సంవత్సరకాలంగా కమలం పార్టీపై కన్నెరజేస్తున్నారు. మోడీని ప్రతి సభలో టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ పై నమ్మకం కుదరడం లేదు. ఇంకా ఆయనపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇందుకు కారణం కేసీఆర్ గతంలో అవలంభించిన రాజకీయ విధానాలే. ఆయనతో కలిసి బీజేపీపై ఉమ్మడి పోరు చేసేందుకు జాతీయ స్థాయి నేతలు తటపటాయిస్తున్నారు.
బీజేపీపై పోరాడుతున్నా కేసీఆర్ తన సభలు,సమావేశాలకు రావాలంటూ బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆహ్వానం పంపుతున్నారు. దాంతో ఆ పార్టీలు తమ ప్రతినిధులను కేసీఆర్ నిర్వహించే సభలు, సమావేశాలకు పంపుతున్నాయి. కాని వారు నిర్వహించే సభలకు మాత్రం కేసీఆర్ ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించగా..ఈ సభకు కాంగ్రెస్ మిత్రపక్షాలతోపాటు అన్ని పార్టీల నేతలు వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం కనిపించలేదు.
అసలు విషయం ఏంటంటే.. స్టాలిన్ నిర్వహించిన సభకు కేసీఆర్ కు ఆహ్వానం లేదు. ఇటీవల కేసీఆర్ సెక్రటేరియట్ ప్రారంభించి అనంతరం నిర్వహించాలనుకున్న సభకు స్టాలిన్ ను కేసీఆర్ ఆహ్వానించారు. ఆయన కూడా ఒకే చెప్పారు. కానీ స్టాలిన్ నిర్వహించిన సభకు కేసీఆర్ కు ఆహ్వానం అందలేదు. మల్లిఖార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తోపాటు పలువురు నేతలను ఆహ్వానించిన స్టాలిన్.. కేసీఆర్ ను ఎందుకు ఆహ్వానించలేదని అందరూ చర్చించుకుంటున్నారు.
కేసీఆర్ రాజకీయ విధానాలు స్టాలిన్ కు తెలుసునని…అందుకే ఈ సభకు కేసీఆర్ ను పిలవలేదనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా.. బీజేపీపై కేసీఆర్ యుద్ధం ప్రారంభిస్తే..మోడీ , షా లు కేసీఆర్ ను అంతగా తేలిగ్గా వదిలేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం ప్రకారమే కేసీఆర్ కేంద్రంతో జగడం ఆడుతున్నారని.. కాంగ్రెస్ మిత్ర పక్షాలను చీల్చే క్రీడలో కేసీఆర్ ను సారధిగా మోడీ, షా లు ఎంపిక చేశారనే అభిప్రాయాలూ వస్తున్నాయి. వీటినే గ్రహించే స్టాలిన్ వంటి నేతలు కేసీఆర్ ను దూరం పెడుతున్నారని చెబుతున్నారు.