ఇటీవలే సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా మరోసారి సీబీఐ నుంచి పిలుపు అందింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. పులివెందులలోని ఆయన నివాసంలో అవినాష్ రెడ్డికి నోటిసులు ఇచ్చారు.
సోమవారం తాను విచారణకు హాజరు కాలేనని ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం విచారణకు హజరు కావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం విధించినట్లు సమాచారం.
జగన్ చిన్నాన్న వివేకా హత్యా కేసులో సీబీఐ దర్యాప్తు చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిని గ్రహించే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్ళిన ప్రతిసారి సీబీఐపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఓ నిజాన్ని వందనుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కాగా ఇటీవల కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు కొంతమంది ఈ కేసుపై విచారించారు. జగన్ సతీమణి భారతి రెడ్డి పీఏ నవీన్ ను మరోసారి విచారణకు పిలుస్తామని ఆయన తరఫు లాయర్ కు సీబీఐ అధికారులు చెప్పగా… ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి సీబీఐ పులుపు రావడం హాట్ టాపిక్ అవుతోంది.
అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటిసులు ఇచ్చింది. కాకపోతే ఆయన కడపలోనే విచారణకు హాజరు కానున్నారు. అవినాష్ రెడ్డిని మాత్రం హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.దీంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారానికి తాజాగా బలం చేకూరుతోంది.