తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచుతున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై అప్పుడే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు తెరవెనక పావులు కదుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీకి పలువురు సినీ ప్రముఖులు ఆసక్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం.. బీజేపీపై యుద్ధంలో కేసీఆర్ కు ప్రధాన మద్దతుదారునిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ తరుఫున పోటీ చేస్తారని అంటున్నారు. గతంలోనే ఆయన మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం.. పైగా కొత్త వ్యక్తి కావడంతో ప్రకాష్ రాజ్ ను తప్పించారు కేసీఆర్. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ విస్తరణపై కర్ణాటకలో ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఆయన కర్ణాటక నుంచే పోటీ చేస్తారా..? తెలంగాణ నుంచి పోటీలో ఉంటారా..?అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జోరుగానే జరుగుతోంది.
ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై.. సై అంటున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆయన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మెప్పు పొందేందుకు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లికి చెందిన ఆయన.. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలనీ తహతహలాడుతున్నారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు దిల్ రాజ్ ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై దృష్టిసారించిన కమలం అగ్రనేతలు పార్టీకి సినీ టచప్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకోసం మంతనాలు కూడా ప్రారంభించారు. ఆ మధ్య హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా నితిన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని… సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు..? అనే అంశాలపై నితిన్ తో చర్చించారని అప్పట్లో సమాచారం బయటకు వచ్చింది. బీజేపీ టికెట్ ఆఫర్ చేస్తే పోటీ చేసేందుకు మీరు రెడీగా ఉన్నారా..? అని నితిన్ ను ప్రశ్నించగా.. నితిన్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఆయనను గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ చేయిస్తారా..? మరేదైనా నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతారా..?అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ తోనూ అమిత్ షా సమావేశం అయినా..ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని నిర్మొహమాటంగా అమిత్ షా కు ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే దర్శకుడు ఎన్.శంకర్ పేరు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శంకర్ సొంత నియోజకవర్గం. జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలు తీసిన ఆయనకు.. జై బోలో తెలంగాణ సినిమాతో మంచి పేరొచ్చింది. 2014 ఎన్నికల్లోనే ఆయనకు కాంగ్రెస్ తరఫున మిర్యాలగూడ నుంచి అవకాశం ఇస్తారనే చర్చ సాగింది. కానీ, అప్పట్లో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఈసారి ఆయన పోటీకి సిద్దంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఇకపోతే విజయశాంతి బీజేపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డిపై రాములమ్మ పోటీలో ఉంటారని అంటున్నారు. పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగనున్నారు. ఆమె జహీరాబాద్ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. ఇక, బాబూ మోహన్ ఎప్పట్లాగే ఆందోల్ నుంచి బరిలో దిగనున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్, టీవీ ఆర్టిస్ట్ కత్తి కార్తీక దుబ్బాక నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.
Also Read : సిత్రాల కవితమ్మా … ఏంటి చీప్ పాలిటిక్స్ ..!