ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకే ఈ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ సర్కార్ గొప్పలు చెప్పుకుంది. కానీ వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తామని చెబుతూ వారి వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై ఇటీవల ఏపీ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఏ అధికారంతో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేస్తారని ప్రశ్నించింది.
ప్రతి 50ఇళ్లకో ఓ వాలంటీర్ చొప్పున నియమించి వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఏ వార్డులో ఎవరెవరు వైసీపీ సానుభూతిపరులు..? ఇతర పార్టీలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు..? ప్రభుత్వ పథకాలపై జనం ఏమనుకుంటున్నారు..?అనే అభిప్రాయాన్ని వాలంటీర్లు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎలాగైతే గతంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించిందో తాజాగా ఎన్నికల సంఘం అదే ఆదేశాలను జారీ చేసింది.
వాలంటీర్ లపై ఏమైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని.. అధికార పార్టీకి ఎన్నికల్లో సహకరించేందుకు వాలంటీర్లు పని చేసే అవకాశం ఉందని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తాజా ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల సహాయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇరకాటంలో పడినట్టేనని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.