తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా ఇబ్బంది పెట్టాలని కేంద్రం అనుకుంటుందో లేదో క్లారిటీ లేదు. కానీ గవర్నర్ తో విబేధాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఇందులో భాగంగానే గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించినట్లు కనిపిస్తోంది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా, అటు తిరస్కరించకుండా పెండింగ్ లో ఉంచారని ఈ విషయమై గవర్నర్ తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేసీఆర్ సర్కార్. విషయం తెలిసిన గవర్నర్ మాట్లాడుతూ.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర అంటూ వ్యాఖ్యానించారు. అంటే..బిల్లులను ఆమోదించాలని తనతో సీఎస్ వచ్చి చర్చిస్తే బాగుండేదని తమిళిసై అభిప్రాయం. కాని సీఎస్ మాత్రం ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా గవర్నర్ తో భేటీకి సిద్దంగా లేరు. ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా రాజ్ భవన్ కు వెళ్తే ఏం జరుగుతుందో శాంతి కుమారికి తెలుసు. అందుకే ఆమె తమిళిసై తో భేటీకి ఆసక్తి చూపలేదు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ప్రగతి భవన్- రాజ్ భవన్ ల మధ్య వివాదం ముగిసినట్లేనని అనుకున్నారు. కానీ ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ – ప్రభుత్వం మధ్య సానుకూల వాతావరణం అంత ఉత్తిదేనని తాజాగా తేలిపోయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే బదులుగా సీఎస్ తనతో వచ్చి చర్చిస్తే బాగుండేదని తమిళిసై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కావాలనే గవర్నర్ విషయంలో తెలంగాణ సర్కార్ రాజకీయం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ సమావేశాల సమయంలో సఖ్యత కుదిరినా గవర్నర్ ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం తీరు మార్చుకోకపోవడంతో తమిళిసై ఆగ్రహంగా ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని ఆమె అసహనంగా ఉన్నారు. సాధారణంగా కొత్త సీఎస్ నియామకం అవుతే గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ శాంతి కుమారి కలవలేదు. దీంతో తమిళిసై ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం – గవర్నర్ ల మధ్య వివాదం మళ్ళీ ప్రారంభమైందని అర్థం అవుతోంది.