బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హటాత్తుగా మహిళా హక్కులు గుర్తుకొచ్చాయి. తొమ్మిదేళ్ళలో ఏనాడూ మహిళా హక్కుల కోసం గర్జించని కవిత గొంతు ఇపుడు పెగులుతుంది. నిజామాబాద్ ఎంపీగా కొనసాగిన సమయంలో ఏనాడూ మహిళల హక్కులు- ఆస్తిత్వ ఉద్యమాలను పట్టించుకోని కవితకు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ లో కాదు. ఏకంగా హస్తినలో ధర్నా చేపడుతామని కవిత ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ఎనిమిదేళ్ళు కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేసిన బీఆర్ఎస్ .. ఏనాడూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైందని మోడీ సర్కార్ ను ప్రశ్నించలేదు. పైగా కవిత నిజామాబాద్ ఎంపీగా కూడా ఉన్నారు. ఐదేళ్ళలో ఏనాడూ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతి ఏమైందని కేంద్రాన్ని కవిత నిలదీయలేదు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అని ఢిల్లీ నుంచి లీకులు రాగానే కవితకు మహిళలు గుర్తుకొచ్చారు. మహిళా హక్కులు గుర్తుకొచ్చాయి. కల్వకుంట్ల రాజకీయాలు అలాగే ఉంటాయి మరి.
మార్చి ఎనిమిదో తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా చేపడుతుందని ప్రకటించారు. వందలాది మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మీడియా సమావేశంలో కవిత ఈ ఒక్క అంశంపైనే మాట్లాడలేదు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ విషయం కూడా ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది. కవితను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత డ్రామా ఆడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ అని మాట్లాడుతోన్న కేసీఆర్ గారాల పట్టి కవిత ముందు బీఆర్ఎస్ ను ఈ అంశంలో నిలదీయాలి. బీఆర్ఎస్ పార్టీ 2014లో మహిళలకు ఇచ్చిన సీట్లు ఎన్ని..? కేవలం 6 సీట్లు అంటే 5.88%. ఇక, 2018లో మహిళలకు 4 సీట్లు అంటే 3.36%. శాసనమండలిలో 34 సీట్లకు మహిళలకు మూడు సీట్లు. అంటే 8.82%. 17 పార్లమెంట్ స్థానాలకు మహిళలకు రెండు సీట్లు.. అంటే 11.76%. మహిళా రిజర్వేషన్లు బీఆర్ఎస్ పార్టీ సక్కగా అమలు చేయడం లేదు. కవిత ఢిల్లీ వెళ్లి ఆందోళన చేస్తే ఆ ధర్నాకు విశ్వసనీయత ఉంటుందా..? కవిత ధర్నా చేయాల్సింది జంతర్ మంతర్ దగ్గర కాదు. ప్రగతి భవన్ ముందనే వాస్తవాన్ని గుర్తెరగాలి.
Also Read : కవిత అరెస్ట్ కు ముహూర్తం ఫిక్స్.. అందుకే ఈ కార్యక్రమం..?