ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్దమైందా..? మార్చి తొమ్మిదిన కవితను అరెస్ట్ చేయనున్నారా..? అరెస్ట్ చేస్తారనే సమాచారంతోనే కవిత కావాలనే నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇటీవలే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ కవితేనని..అందులో భాగంగానే కేసీఆర్ ప్రగతి భవన్ లో హైలెవల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. లిక్కర్ స్కాంలో కవిత పేరును ఇప్పటికి పలుమార్లు చార్జిషీట్లతో పాటు కోర్టుకు సమర్పించిన వివిధ పత్రాల్లో సీబీఐ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ లో ఆమె బినామీ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నరారని ఆరోపించింది.
ఇప్పటికే ఓ సారి కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించగా మరోసారి విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని .ఈ క్రమంలోనే ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై దుమ్మెత్తిపోశారు.
కేంద్రంపై పోరాడుతున్న వారినే టార్గెట్ చేశారని కవిత ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా విపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నాయని..భారీ స్కాంకు పాల్పడిన అదానీ విషంయలో సీబీఐ, ఈడీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని కవిత ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే సెబీతో పాటు ఓ కమిటీ విచారణకు ఏర్పాటయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తే దర్యాప్తు ఏజెన్సీలతో భయపెడుతున్నారని మండిపడ్డారు.
మహిళా దినోత్సవం రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు కవిత వెల్లడించారు. అయితే… ఈ ధర్నా వ్యూహాత్మక ఎత్తుగడ అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తారని ఢిల్లీ నుంచి సమాచారం అందటంతోనే మహిళా నేతలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలనే నిర్ణయం కవిత తీసుకున్నట్లు చెబుతున్నారు.
మహిళా బిల్లు ఆమోదం కోసం పోరాటం ప్రారంభించినందునే కవితను అరెస్ట్ చేశారని… లిక్కర్ స్కాం కేసు మరకలు అంటకుండా రాజకీయ కుట్ర కేసు అని విమర్శలు చేయవచ్చుననే వ్యూహంతోనే ఈ ధర్నాకు పిలుపునిచ్చి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో మహిళల సపోర్ట్ ను పొందవచ్చునని..కవితను అరెస్ట్ చేసిన వెంటనే ఢిల్లీలో ఆందోళనలు చేసేందుకు వీలుగా హస్తినలో ఈ ధర్నాకు ప్లాన్ చేశారని అంటున్నారు.