శ్రీచైతన్య… తెలుగు రాష్ట్రాల్లో టాప్ కార్పోరేట్ కాలేజ్. ఈ విద్యాసంస్థను కాలేజ్ అనే కంటే విద్యార్థుల రక్తమాంసాల మీద కాసులు దండుకునే సంస్థ అంటే సబబుగా ఉంటుంది. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇలా వెలువడుతాయో లేదో.. అప్పుడే ఇంటింటికి వెళ్లి పీఆర్వోలు క్యాంపెయిన్ నిర్వహిస్తారు. మీ పిల్లల బంగారు భవిష్యత్ పూచి మాదంటూ మనసును దోచే కబుర్లు చెప్తారు. కట్ చేస్తే విద్యార్థులకు కాలేజ్ లో నరకం చూపిస్తారు. ఎంత చదివి ఎన్ని మార్కులు సంపాదించినా…చదవడం కాదు. ర్యాంక్ తెచ్చుకోవాలని చావబాదుతారు. ఒక్కోసారి మధ్యాహ్నం అన్నం బంద్ చేస్తారు. మండుటెండలో నిల్చోబెడుతారు. విద్యార్థులందరి ముందు సూటిపోటి మాటలతో అవమానిస్తారు. ఫలితంగా అప్పుడప్పుడే వికాసం పొందే ఇంటర్ విద్యార్థులు మనస్తాపానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికీ కడుపుకోతను మిగుల్చుతున్నారు. నార్సింగి శ్రీచైతన్య కాలేజ్ విద్యార్ధి సాత్విక్ అత్మహత్య చేసుకోవడానికి కాలేజ్ వేధింపులే కారణం.
నిజానికి.. మనిషికి ఎనిమిది గంటల నుంచి పదిగంటల నిద్ర అవసరం. శ్రీచైతన్య విద్యార్థులకు మత్రం నాలుగు గంటల నిద్ర కూడా ఉండదు. తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యార్థులను మేల్కొలిపి అర్దరాత్రి ఒంటిగంట వరకు చదవమని ఒత్తిడి చేస్తూనే ఉంటారు. స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులు, ఐఐటీ కోచింగ్ ,నీట కోచింగ్ అని విద్యార్థులకు నిత్య నరకం చూపిస్తారు. ఇక పరీక్షల సమయంలో మాత్రం విద్యార్థులకు నిద్రన్నదే ఉండదు. కనీసం తినే తిండిని కూడా సరిగా తిననివ్వరు. ఈ విషయాలు బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడుతారు. కాలేజ్ లో జరిగే విషయాలను బయటకు చెప్పొద్దని బెదిరిస్తారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన శ్రీ చైతన్య యాజమాన్యం నిబంధనలను పూర్తిగా విస్మరిస్తోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం శ్రీ చైతన్యలో గడిచిన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు 70 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా బయటకు రానివి చాలానే ఉన్నాయి. విద్యార్థుల అనారోగ్యానికి కారణమై…చివరికి మరణిస్తే తమ తప్పేమీ లేదని కప్పిపుచ్చుతున్నాయి. సాత్విక్ విషయంలో కాలేజ్ యాజమాన్యం వ్యవహరించిన తీరు చూస్తే రక్తం సలసల మసులుతుంది. సాత్విక్ కు అన్నం కూడా పెట్టకుండా..మండుటెండలో నిల్చోబెట్టి వేధించారు. కనీస మానవత్వం కూడా చూపలేదు. కాలేజ్ వేధింపులు తట్టుకోలేక చివరికి ఉరేసుకొని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సాత్విక్ ను బయటకు తీసుకెళ్తామని సహా విద్యార్థులు ప్రాధేయపడితే ఒక్కరంటే ఒక్కరు కాలేజ్ యాజమాన్యం స్పందించలేదు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య.
సాత్విక ఆత్మహత్య ఘటనపై తెలంగాణ విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. కాలేజ్ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కేసు నమోదు చేయడం.. విచారణకు ఆదేశించడం.. బాధితుల తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేయడం ఇది ఎప్పుడు జరిగేదే. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ మళ్ళీ సాత్విక్ లాంటి సంఘటనలు జరగకుండా సర్కార్ చర్యలు తీసుకుంటుందా..? ఈ ఏడాదిలో 70మంది విద్యార్థుల చావులకు కారణమైన శ్రీచైతన్య కాలేజ్ యాజమాన్యంపై మర్డర్ కేసు నమోదు చేసి..ఆ సంస్థలను శాశ్వతంగా మూసేగయలరా..? కార్పోరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలని మాట్లాడే విద్యార్ధి సంఘాలు.. శ్రీ చైతన్య కాలేజ్ ల మూసివేత కోసం నిర్విరామంగా పోరాటాలు చేయగలవా..?పేరెంట్స్ ఆసోసియేషన్లు రోడ్డెక్కి సాత్విక్ ను బలి తీసుకున్న శ్రీచైతన్యకు వ్యతిరేకంగా గళం విప్పగలవా..? ప్రభుత్వాలను కార్పోరేట్ మాఫియా ఏలుతున్న కాలమిది. ఎవరు కార్పోరేట్ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడిన అరెస్టులు.. హత్యలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం.
శ్రీచైతన్య కాలేజ్ యాజమాన్యంకు మంత్రి కేటీఆర్ తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కోకాపేటలో అరవై ఎకరాల భూమి వేలంపాట వేసినప్పుడు శ్రీచైతన్యకు కూడా ఎకరం కట్టబెట్టారు. టీఆర్ఎస్ పార్టీకి విరాళాలు కూడా ఇచ్చే శ్రీచైతన్య కాలేజ్ పై తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వాలు ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలే కోరుకుంటాయి. కేటీఆర్ అందుకు మినహాయింపు ఎలా అవుతాడు. ఎవరో బిడ్డ ఉరేసుకొని చనిపోతే కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాలను త్యజించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాడా..? అందుకే ప్రభుత్వ విద్య.. వైద్యానికి మోస్ట్ ప్రియార్టి ఇచ్చే పార్టీలను ప్రజలు ఎంచుకొని ఓట్లేస్తే కార్పోరేట్ మాఫియా చెలరేగుతుందా..? వేలాది మంది విద్యార్థులు మధ్యలోనే రాలిపోయి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చేవారా..? ఆలోచించండి.