నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న సాత్విక్ అనే విద్యార్ధి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ యాజమాన్యం వేధింపులను భరించలేకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు రాసిన లెటర్ లో పేర్కొన్నాడు. ఈ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్ లో సాత్విక్ తన ఆవేదనను వెల్లగక్కిన తీరు అందరిని కంటతడి పెట్టిస్తోంది.
“అమ్మా నాన్న నన్ను క్షమించండి. మిమ్మిల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు పెట్టే టార్చర్ తో ఆత్మహత్య చేసుకుంటున్నా. కృష్ణా, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. అమ్మనాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్” అని సూసైడ్ లెటర్ రాసి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక, కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న స్వాతిక్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి.. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి తరలిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో పోలీసులు మొహరించారు.
శ్రీచైతన్య కార్పోరేట్ కాలేజ్ లో విద్యార్థుల ఆత్మహత్యల్లో సాత్విక్ ది మొదటి కాదు. అలా అని చివరిది కాదు. సూసైడ్ లెటర్ లభించడంతో కాలేజ్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తారు. సాత్విక్ ను వేధించిన అధ్యాపకులను విధుల నుంచి తొలగిస్తారు. ఇదంతా రొటీన్ గా జరిగే తంతే. కానీ కార్పోరేట్ కాలేజ్ లు ర్యాంకుల వేటలో విద్యార్థులను బలి చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోదు. విద్యార్థి సంఘాలు కూడా నాలుగు రోజులు రోడ్డుపై ఆందోళన చేసి మళ్ళీ సైలెంట్ అయిపోతాయి.
సాత్విక్ ను వేధించిన అధ్యాపకులపై చర్యలు తీసుకున్నంత మాత్రానా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కార్పోరేట్ మాఫియాపై సర్కార్ ఉక్కుపాదం మోపితేనే సాత్విక్ లాంటి పరిస్థితి మరో విద్యార్ధికి రాకుండా ఉంటుంది. మరి ఆ ప్రయత్నాలను సర్కార్ చేస్తుందా..? ఆ దిశగా విద్యార్ధి సంఘాలు పోరాటం చేస్తాయా..? చూడాలి.
Also Read : శ్రీచైతన్య వేధింపులకు విద్యార్ధి బలి…లక్షలు పోసి చదివించేది చావు చూడటానికా..?